Friday, September 4, 2026

Buy now

బీఆర్ఎస్‌ను హస్తగతం చేసేందుకు గుంటనక్క కుట్ర

* హరీశ్‌రావుపై కల్వకుంట్ల కవిత తీవ్ర ఆరోపణలు
* మెదక్ ఎమ్మెల్యేలతో రహస్య మంతనాలు.. కేసీఆర్‌కు వెన్నుపోటు పొడిచే ప్రయత్నం
* బీజేపీతోనూ, గుంపుమేస్త్రీతోనూ లాలూచీ ఉందని వ్యాఖ్యలు
* సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని విమర్శ

హైదరాబాద్: బీఆర్ఎస్‌ను హస్తగతం చేసుకునేందుకు హరీశ్‌రావు తెరవెనుక కుట్రలు చేస్తున్నారని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. బంజారాహిల్స్‌లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో గురువారం మీడియాతో మాట్లాడిన ఆమె.. ఎన్టీఆర్‌కు చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచిన తరహాలో కేసీఆర్‌కు హరీశ్‌రావు వెన్నుపోటు పొడిచేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఇటీవల మెదక్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతో హరీశ్‌రావు రహస్యంగా సమావేశమయ్యారని, కేసీఆర్ వారసత్వం కేటీఆర్‌కు దక్కకూడదని ఆయన వ్యాఖ్యానించినట్లు ఆరోపించారు.

బీఆర్ఎస్‌ను హస్తగతం చేసుకునే కుట్ర:
కేసీఆర్ రాజకీయంగా చేరదీసి అవకాశం కల్పించిన హరీశ్‌రావు ఇప్పుడు అదే నాయకుడికి వెన్నుపోటు పొడిచేందుకు సిద్ధమయ్యారని కవిత ఆరోపించారు. తాను ఆధారాలు లేకుండా మాట్లాడనని పేర్కొంటూ.. మెదక్ ఎమ్మెల్యేలతో జరిగిన రహస్య సమావేశం గురించి తనకు సమాచారం అందిందన్నారు. బీఆర్ఎస్‌ను తన ఆధీనంలోకి తెచ్చుకునేందుకు హరీశ్‌రావు బీజేపీతోనూ, గుంపుమేస్త్రీతోనూ సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారని ఆరోపించారు.

బీజేపీ ముఖ్యనేతతో హరీశ్‌రావు తరచూ సమావేశాలు నిర్వహిస్తున్నారని, హైదరాబాద్‌లోని రాజ్‌పుష్ప స్కైవాక్ ఓపెన్ విల్లాస్‌లో ఈ భేటీలు జరుగుతున్నాయని కవిత పేర్కొన్నారు. ఈ సమావేశాలకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని తెలిపారు.

లండన్‌ భేటీపై ఆరోపణలు:
హరీశ్‌రావుకు బీజేపీతో మాత్రమే కాకుండా గుంపుమేస్త్రీతోనూ లాలూచీ ఉందని కవిత ఆరోపించారు. ఇటీవల లండన్‌లో ఇద్దరూ రహస్యంగా సమావేశమై ఒప్పందం చేసుకున్నారని అన్నారు. ఈ వ్యవహారానికి సంబంధించిన వివరాలను టీఆర్ఎస్ తరఫున ఒక్కొక్కటిగా బయటపెడతామని చెప్పారు.

హరీశ్‌రావు ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న సమయంలో కొన్ని విద్యా సంస్థలకు భారీగా పాల సరఫరా జరిగిందని కవిత ఆరోపించారు. ఎనిమిదేళ్లలో రూ.960 కోట్ల మేర వ్యాపారం జరిగిందని పేర్కొంటూ.. కార్పొరేట్ ఆసుపత్రులకు కూడా పాలు సరఫరా చేశారని అన్నారు. ఈ వ్యవహారాలపై ప్రభుత్వం సమగ్రంగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

రేవంత్‌రెడ్డిపై తీవ్ర విమర్శలు
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలంగాణ ప్రయోజనాలను పణంగా పెట్టి ఆంధ్రా ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నారని కవిత విమర్శించారు. తెలంగాణకు సంబంధించిన కీలక పదవులు, సంస్థల్లో ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు.

బ్రాహ్మణ పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్ నియామకాలపై ప్రశ్నలు లేవనెత్తిన ఆమె.. తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించిన వ్యక్తికి కీలక పదవి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. యాదగిరిగుట్ట బోర్డు నియామకాల్లోనూ తెలంగాణ ప్రయోజనాలను విస్మరించారని ఆరోపించారు.

ప్రమాద ఘటనలపై ప్రభుత్వాన్ని నిలదీత:
జనసేనకు చెందిన ఓ ఎంపీ కుమారుడికి సంబంధించిన రోడ్డు ప్రమాద ఘటనపై ప్రభుత్వం వ్యవహరించిన తీరును కవిత ప్రశ్నించారు. ఎఫ్‌ఐఆర్‌లో పలు వివరాలు నమోదు చేయలేదని ఆరోపిస్తూ పోలీసు శాఖ తీరుపై విమర్శలు చేశారు. ఇదే సమయంలో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడి ఘటనలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించిందని గుర్తుచేశారు. చట్టం అందరికీ సమానంగా ఉండాలని డిమాండ్ చేశారు.

తెలంగాణలో ఆంధ్రా పెత్తనం పెరిగిందని ఆరోపణ:
రెడ్‌కో చైర్మన్, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీతో పాటు విద్యుత్, నీటిపారుదల శాఖల్లోనూ ఆంధ్రా పెత్తనం కొనసాగుతోందని కవిత ఆరోపించారు. తెలంగాణ జలాలు, కాంట్రాక్టుల విషయంలో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. తెలంగాణ కోసం సాధించిన రాష్ట్రంలో మళ్లీ ఆంధ్రా ఆధిపత్యం ఎందుకు ఉండాలని ప్రశ్నించారు.తెలంగాణ ప్రయోజనాల కోసం ప్రభుత్వం పనిచేయాలని, బ్రాహ్మణ పరిషత్‌లో తెలంగాణకు చెందిన అర్హులకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.

బీఆర్ఎస్‌పైనా విమర్శలు:
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించాల్సిన బీఆర్ఎస్ రాజీ ధోరణిలో వ్యవహరిస్తోందని కవిత విమర్శించారు. పాల వ్యాపారం, రియల్ ఎస్టేట్ వంటి అంశాల కారణంగా ప్రభుత్వాన్ని నిలదీయడం లేదని ఆరోపించారు.

అధికారంలో ఉన్న సమయంలో బీఆర్ఎస్ వ్యవస్థీకృతంగా అవినీతికి పాల్పడిందని ఆమె ఆరోపించారు. ఇరిగేషన్, పాల వ్యాపారం, రియల్ ఎస్టేట్, ఇసుక వ్యవహారాలను వేర్వేరు వ్యక్తులు పంచుకున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలూ ప్రజలను మోసం చేశాయని విమర్శించారు.

తమకు అవకాశం ఇస్తే పారదర్శకమైన, అవినీతి రహిత పాలన అందించడంతో పాటు కొత్త నాయకత్వానికి అవకాశం కల్పిస్తామని కవిత తెలిపారు. తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.

Related Articles

spot_img

Most Popular