Friday, September 4, 2026

Buy now

దాబా బి గ్రామంలో ‘పోలీసులు మీకోసం’ కార్యక్రమం

* జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్
* డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి.. గ్రామ భద్రతకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి
* రోడ్డు భద్రతా నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు తగ్గుతాయి: ఎస్పీ

ఇచ్చోడ: మండలంలోని దాబా బి గ్రామంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ఆధ్వర్యంలో ‘పోలీసులు మీకోసం’ కార్యక్రమంతో పాటు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు పోలీసు శాఖ సేవలు, మహిళలు, బాలికల భద్రత, మాదకద్రవ్యాల నివారణ, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు.

గంజాయి, గుడుంబా, ఇతర మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని ఎస్పీ సూచించారు. గ్రామంలో ఎక్కడైనా గంజాయి లేదా మాదకద్రవ్యాల సాగు, విక్రయం జరుగుతున్నట్లు సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. గ్రామ భద్రతను మరింత పటిష్టం చేసేందుకు సీసీ కెమెరాల ప్రాధాన్యతను వివరించారు.

* రోడ్డు భద్రతపై అవగాహన
వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని ఎస్పీ సూచించారు. నంబర్ ప్లేట్ లేని వాహనాలను ఉపయోగించవద్దని, వాహనాలకు సంబంధించిన పత్రాలను సక్రమంగా ధృవీకరించుకోవాలని అవగాహన కల్పించారు. రోడ్డు భద్రతా నిబంధనలు పాటించడం వల్ల ప్రమాదాలు సుమారు 25 శాతం తగ్గినట్లు తెలిపారు.ఇచ్చోడ విద్యాలయ విద్యార్థులు డ్రగ్స్ నివారణ, రోడ్డు భద్రత అంశాలపై ప్రదర్శించిన అవగాహన స్కిట్ ఆకట్టుకుంది.

* మహిళలు, బాలికలకు వైద్య అవగాహన
ఉచిత మెడికల్ క్యాంప్‌లో మహిళలు, బాలికలకు PCOD, రక్తహీనత, డెంగ్యూ, మలేరియా నివారణపై వైద్య సిబ్బంది అవగాహన కల్పించారు. అవసరమైన వారికి ఉచిత కంటి శస్త్రచికిత్స సేవలు అందించనున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా విద్యార్థులు ఎస్పీ అఖిల్ మహాజన్‌కు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు, బాలికల భద్రతకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎస్పీ భరోసా ఇచ్చారు. ప్రజలకు చేరువగా ఉంటూ వారి సమస్యలను పరిష్కరించేందుకు పోలీసు శాఖ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.

Related Articles

spot_img

Most Popular