Friday, September 4, 2026

Buy now

కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం వచ్చాకే ఎల్బీనగర్‌కు అధిక నిధులు

* రూ.1.44 కోట్ల సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన మధుయాష్కి గౌడ్
* నియోజకవర్గ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక సహకారం: మధుయాష్కి

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే ఎల్బీనగర్ నియోజకవర్గానికి అధిక మొత్తంలో నిధులు మంజూరవుతున్నాయని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎల్బీనగర్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక సహకారం అందిస్తున్నారని తెలిపారు.

చంపాపేట డివిజన్‌లోని మారుతీనగర్ కాలనీలో రూ.1.44 కోట్ల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మల్రెడ్డి రాంరెడ్డి, సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు మిద్దెల జితేందర్‌తో కలిసి మధుయాష్కి గౌడ్ శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మధుయాష్కి గౌడ్ మాట్లాడుతూ, అభివృద్ధి కోసమని పార్టీ మారిన స్థానిక ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేయకుండా ప్రజలను మోసం చేశారని విమర్శించారు. సూర్యుడి కంటే ముందే లేస్తానంటూ డైలాగులు చెప్పడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని ఆరోపించారు. మూసీ కార్పొరేషన్ చైర్మన్ పదవి పొందినప్పటికీ నియోజకవర్గంలో చెప్పుకోదగ్గ అభివృద్ధి జరగలేదని అన్నారు.

రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గంలో అభివృద్ధి పనులు కొనసాగిస్తున్నామని మధుయాష్కి తెలిపారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే ఎల్బీనగర్‌కు నిధులు మంజూరయ్యాయని బీజేపీకి చెందిన మాజీ కార్పొరేటర్లు సైతం పలు వేదికలపై పేర్కొన్న విషయాన్ని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారులు ప్రజల సమస్యలపై స్పందిస్తూ అభివృద్ధి పనులు చేపడుతున్నారని అన్నారు.

గత ప్రభుత్వం ప్రజలు చెల్లించిన పన్నులను కాళేశ్వరం ప్రాజెక్టు వైపు మళ్లించి కమీషన్లకు పాల్పడిందని ఆరోపించిన మధుయాష్కి, సీఎం రేవంత్ రెడ్డి మాత్రం నగరంలో వసూలు చేసే పన్నులను నగర అభివృద్ధికే ఖర్చు చేస్తున్నారని అన్నారు. రోడ్లు, డ్రైనేజీ, మంచినీరు వంటి మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.

చంపాపేట డివిజన్‌లో గతంలో వరద ముంపు సమస్య తీవ్రంగా ఉండేదని, రూ.5 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టి సమస్యను పరిష్కరించామని మధుయాష్కి పేర్కొన్నారు. మిగిలిన డ్రైనేజీ సమస్యలను కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

118 జీవోపై ఎమ్మెల్యేపై విమర్శలు
ఎంపీగా ఈటల రాజేందర్ ఎల్బీనగర్ నియోజకవర్గానికి ఎన్ని నిధులు తీసుకొచ్చారని మధుయాష్కి ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే 118 జీవో ద్వారా కన్వేయన్స్ డీడ్ తీసుకొచ్చి ప్రజలను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు.మునుగోడు ఉప ఎన్నికల సమయంలో హడావుడిగా 118 జీవో తీసుకొచ్చి, ప్రజలు కష్టపడి కొనుగోలు చేసిన ఇళ్లలో వారినే కబ్జాదారులుగా చూపిస్తూ కన్వేయన్స్ డీడ్‌లు అందించారని విమర్శించారు. ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి కన్వేయన్స్ డీడ్ పేరుతో చిత్తుకాగితాలను అందించారని ఆరోపించారు.

SIR ఫేజ్-2పై అప్రమత్తంగా ఉండాలి
SIR ఫేజ్-2లో ఎవరూ నిర్లక్ష్యం వహించవద్దని మధుయాష్కి గౌడ్ సూచించారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో 1.87 లక్షల ఓట్లు నో మ్యాపింగ్‌లో ఉన్నాయని తెలిపారు. నోటీసులు అందుకున్న ప్రతి ఒక్కరూ సరైన వివరాలు, అవసరమైన పత్రాలను సమర్పించి తమ ఓటు హక్కును కాపాడుకోవాలని సూచించారు.

దుర్గాభవాని నగర్‌లో సమస్యల పరిశీలన
అనంతరం మధుయాష్కి గౌడ్ దుర్గాభవాని నగర్‌లో పర్యటించి స్థానికుల సమస్యలను తెలుసుకున్నారు. అధ్వానంగా మారిన క్రీడా ప్రాంగణాన్ని పరిశీలించారు. కబ్జాదారుల నుంచి ఇటీవల హైడ్రా కాపాడిన పార్కు స్థలాన్ని సందర్శించారు.కాలనీవాసుల విజ్ఞప్తి మేరకు పార్కు స్థలాన్ని అభివృద్ధి చేస్తామని మధుయాష్కి తెలిపారు. పార్కు స్థలాన్ని కాపాడిన హైడ్రా చర్యలను అభినందించారు. ఎస్సీ బస్తీలోని నవజీవన్ జ్యోతి సంఘం కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులను కూడా పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు దరిపల్లి రాజశేఖర్ రెడ్డి, సామ రమణారెడ్డి, డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు నోముల రవీందర్ గౌడ్, మాజీ అధ్యక్షుడు శ్రీపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular