Friday, September 4, 2026

Buy now

సిరిసిల్లలో 710 మందికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్,కలెక్టర్ గరిమ అగ్రవాల్.

సిరిసిల్ల: మొదటి విడత కింద మంజూరు అయి నిర్ణీత సమయంలో ఇండ్లు నిర్మించుకొని వారి స్థానంలో నూతనంగా 710 మందికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు ధ్రువ పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని తెలంగాణ గృహ నిర్మాణ సంస్థ ఆద్వర్యంలో సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని సాయి మణికంఠ ఫంక్షన్ హాల్ లో గురువారం నిర్వహించగా, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలు, ఆయా మండలాల లబ్ధిదారులకు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్, అధికారులతో కలిసి మంజూరు పత్రాలు అందజేశారు. ఆయా మండలాల వారికి స్టాళ్లు ఏర్పాటు చేసి.. అధికారులు మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. స్టాళ్లలో ఈ పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పరిశీలించారు.

ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని తెలిపారు. పేదవాడి సొంత ఇంటి కల నెరవేరుస్తున్నామని వివరించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో పేదవాడి సొంత ఇంటి కల నెరవేరుతుందని స్పష్టం చేశారు. అలాగే ఆయా గ్రామాలు, మున్సిపాలిటీల పరిధిలో కూలీలకు ఉపాధి, వివిధ వృత్తుల వారికి పని, దుకాణదారులకు వ్యాపార లావాదేవీలు కొనసాగుతు న్నాయని వెల్లడించారు. జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయని పేర్కొన్నారు.

రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, వ్యవసాయానికి ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం విజయవంతంగా అమలు చేస్తున్నామని వెల్లడించారు. పథకాల అమలులో రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా ఉందని తెలిపారు. తమిళనాడులో ఉచిత విద్యుత్, కేరళలో ఉచిత బస్సు లాంటి పథకాలు అమలు చేస్తున్నారని వివరించారు.

రైతులకు రూ.రెండు లక్షల వరకు రుణ మాఫీ చేశామని తెలిపారు. నూతన రేషన్ కార్డులు జారీ చేస్తున్నామని వెల్లడించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. నూతన పెన్షన్లు ఇచ్చేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామని పేర్కొన్నారు. అన్ని వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా ప్రభుత్వం పథకాలు అమలు చేస్తుందని వివరించారు. జిల్లాలోని ధార్మిక, కార్మిక క్షేత్రాల అభివృద్ధికి పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు పొందిన వారు ఇండ్లు వేగంగా పూర్తి చేసుకోవాలని పిలుపు నిచ్చారు.

*సొంత ఇల్లు ప్రతి ఒక్కరి కల..*
జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ… సొంత ఇల్లు నిర్మాణం ప్రతి ఒక్కరి కల అని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు పొందిన వారు ప్రభుత్వం నిర్ణయించిన విస్తీర్ణంలో ఇల్లుకు త్వరితగతిన ముగ్గు పోసుకోవాలని సూచించారు. ప్రతి మండల కేంద్రంలోని మోడల్ హౌస్ లను తప్పనిసరిగా సందర్శించాలని, ప్రభుత్వం ఇచ్చే రూ. ఐదు లక్షల ఆర్థిక సహాయంతోనే ఇల్లు పూర్తి చేసుకోవాలని పిలుపు నిచ్చారు.

రెండో విడత కింద ప్రతి నియోజకవర్గానికి 2,000 ఇండ్లు చొప్పున మంజూరు చేసిందని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకునే వారికి నాలుగు దశల్లో మొత్తం రూ. ఐదు లక్షల ఆర్థిక సహాయం బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతుందని వెల్లడించారు. పంచాయతీ కార్యదర్శి, హౌసింగ్ అధికారులు లబ్ధిదారుల ఇంటికి వచ్చి ఇండ్ల నిర్మాణ దశల ఫోటోలు తీస్తారని తెలిపారు. ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేసి.. గృహ ప్రవేశాలు చేసి.. ఆనందంగా ఉండాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకాంక్షించారు.

కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ చైర్మన్లు జిందం కళ, పుల్కం రాజు, మార్కెట్ కమిటీ చైర్మన్లు తిరుపతి, ఎల్లయ్య, రాజు, స్వరూప, సబేరా బేగం, రాణి, రాములు నాయక్, విజయ, హౌసింగ్ పీడీ వెంకట మాధవ రావు, సిరిసిల్ల ఆర్డీఓ శ్రీధర్ బాబు, తహసీల్దార్ మహేష్, కౌన్సిలర్లు, సర్పంచులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular