* ప్రమాద రహిత సింగరేణి కోసం అన్ని చర్యలు.. ఆధునిక సాంకేతికత వినియోగం: సీఎండీ డా. బుద్దప్రకాష్ జ్యోతి
హైదరాబాద్, సెప్టెంబర్ 3: సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి కంటే ఉద్యోగుల భద్రతకే అధిక ప్రాధాన్యత ఇస్తామని సింగరేణి ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డా. బుద్దప్రకాష్ జ్యోతి తెలిపారు. ప్రమాద రహిత సింగరేణి కోసం అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని, కార్మిక సంఘాలు చేస్తున్న సూచనలను పరిగణనలోకి తీసుకుని భద్రతా చర్యలను మరింత బలోపేతం చేస్తామని చెప్పారు.
గురువారం హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో జరిగిన 50వ త్రైపాక్షిక భద్రత సమీక్షా సమావేశంలో సీఎండీ మాట్లాడారు. ఈ సమావేశంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ (DGMS) అధికారులు, సింగరేణి అధికారులు, గుర్తింపు పొందిన, ప్రాతినిధ్య కార్మిక సంఘాల నాయకులు, యాజమాన్య ప్రతినిధులు పాల్గొన్నారు.
ప్రమాదాల నివారణకు ఆధునిక సాంకేతికత:
గనుల్లో ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలు సమర్థవంతంగా అమలవుతున్నాయా? గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం అవుతున్నాయా? ప్రమాద రహిత మైనింగ్ కోసం అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతికతను ఎలా వినియోగించాలి? అనే అంశాలపై సమావేశంలో సమగ్రంగా చర్చించినట్లు సీఎండీ తెలిపారు.
కార్మిక సంఘాల ప్రతినిధులు చేసిన సూచనలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
గతంతో పోలిస్తే ప్రమాదాలు తగ్గాయి:
డైరెక్టర్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ డా. సగేష్ కుమార్ మాట్లాడుతూ.. సమావేశంలో కార్మిక సంఘాలు విలువైన సూచనలు చేశాయని తెలిపారు. భద్రత విషయంలో సింగరేణి యాజమాన్యం, కార్మిక సంఘాలు నిబద్ధతతో పనిచేయడం అభినందనీయమన్నారు.
గతంతో పోలిస్తే ఈ ఏడాది ప్రాణాపాయ ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గడం అభినందనీయమని పేర్కొన్నారు. ఓపెన్‌కాస్ట్ గనుల్లో సింగరేణి ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్ కార్మికుల హాజరును ఒకే చోట బయోమెట్రిక్ విధానంలో నమోదు చేసే ప్రక్రియను వెంటనే అమలు చేయాలని సూచించారు.ఉద్యోగుల భద్రతను మరింత పెంచేందుకు అవసరమైన శిక్షణ అందించడానికి డీజీఎంఎస్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని తెలిపారు.
కార్మిక సంఘాల పలు సూచనలు:
సింగరేణి కాలరీస్ వర్కర్స్ గుర్తింపు కార్మిక సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, కార్యదర్శి రాజ్ కుమార్, ప్రాతినిధ్య కార్మిక సంఘం ఐఎన్‌టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎస్. నరసింహారెడ్డి, అధికారుల సంఘం అధ్యక్షుడు తాళ్లపల్లి లక్ష్మీపతి గౌడ్, ప్రధాన కార్యదర్శి పెద్ది నరసింహులుతో పాటు వివిధ ఏరియాల ప్రతినిధులు సమావేశంలో పలు సూచనలు చేశారు.
గనుల్లో సిబ్బంది కొరతను తగ్గించడం, ఆధునిక వైద్య సేవలను విస్తరించడం, కాంట్రాక్ట్ కార్మికులకు తగిన శిక్షణ అందించడం, నాణ్యమైన భద్రతా బూట్లు సరఫరా చేయడం, అవసరమైన సూపర్‌వైజర్లు, సిబ్బంది, అధికారులను నియమించడం, స్పేర్ పార్ట్స్‌ను అందుబాటులో ఉంచడం వంటి అంశాలను యాజమాన్యం దృష్టికి తీసుకువచ్చారు.
వీటిపై తగిన చర్యలు తీసుకుంటామని సింగరేణి ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు.
మృత కార్మికులకు సంతాపం:
సమావేశానికి జనరల్ మేనేజర్ (సేఫ్టీ) సాయిబాబు స్వాగతం పలికారు. ఇటీవల జరిగిన ప్రమాదాల్లో మృతి చెందిన కార్మికులకు సమావేశం సంతాపం తెలిపింది. అనంతరం గత ఏడాది త్రైపాక్షిక భద్రతా సమీక్ష సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలుపై చర్చించారు. సమావేశం సుహృద్భావ వాతావరణంలో కొనసాగింది.
ఈ సమావేశంలో డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎల్.వి. సూర్యనారాయణ, డైరెక్టర్ (ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్) కె. వెంకటేశ్వర్లు, డైరెక్టర్ (పర్సనల్ అండ్ ఫైనాన్స్) గౌతమ్ పోట్రు, డైరెక్టర్ (ఈ అండ్ ఎం) ఎం. తిరుమలరావు, జనరల్ మేనేజర్ (కోఆర్డినేషన్ అండ్ మార్కెటింగ్) తాడబోయిన శ్రీనివాస్, అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లు, కార్పొరేట్ జనరల్ మేనేజర్లు, డీజీఎంఎస్ అధికారులు, డిప్యూటీ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

