Friday, September 4, 2026

Buy now

1000 రోజుల పాలనలో రైతులకు ఇచ్చిన హామీలేవీ నెరవేర్చలేదు

* కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజం

గొల్లపల్లి: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయినా రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. ధర్మపురి నియోజకవర్గంలోని గొల్లపల్లి మండల కేంద్రంలో బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన కొప్పుల ఈశ్వర్.. అనంతరం రైతులు, పార్టీ కార్యకర్తలతో కలిసి ఎడ్లబండిపై ముస్కు శ్యాంసుందర్ గార్డెన్ వరకు చేరుకున్నారు. అక్కడ నిర్వహించిన సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు.

ముందు మీ పాలనపై ప్రజల అభిప్రాయం తెలుసుకోండి:
కాంగ్రెస్ ప్రభుత్వం తన 1000 రోజుల అభివృద్ధి ప్రోగ్రెస్ రిపోర్ట్‌ను తనకు పంపడం కంటే, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముందుగా తన స్వంత పరిపాలనపై ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని కొప్పుల ఈశ్వర్ సూచించారు.

కేసీఆర్‌ హయాంలో చేసిన అప్పులపై కాంగ్రెస్ చేస్తున్న విమర్శలను ఆయన ఖండించారు. పార్లమెంట్‌లో నాటి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించిన గణాంకాలను ప్రస్తావిస్తూ తెలంగాణ మొత్తం అప్పు రూ.3.90 లక్షల కోట్లుగా పేర్కొన్నారని, అందులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి వచ్చిన రూ.72 వేల కోట్ల అప్పు కూడా ఉందని వివరించారు.

కేసీఆర్‌ ప్రభుత్వం తీసుకున్న అప్పులు కాళేశ్వరం ప్రాజెక్టు, సాగునీటి విస్తరణ, గురుకుల పాఠశాలలు, మెడికల్ కాలేజీలు, కలెక్టరేట్లు, పోలీస్ కమిషనరేట్లు, బస్తీ దవాఖానాలు తదితర మౌలిక వసతుల కల్పనకు వినియోగించామని తెలిపారు.

రూ.3.50 లక్షల కోట్ల అప్పుతో ఏం చేశారు?:
ప్రస్తుత ప్రభుత్వం మూడేళ్లు పూర్తికాకముందే సుమారు రూ.3.50 లక్షల కోట్ల అప్పులు చేసిందని కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. ఇంత భారీగా అప్పులు చేసినప్పటికీ రాష్ట్రంలో ఎక్కడా చెప్పుకోదగిన అభివృద్ధి, నిర్మాణాలు కనిపించడం లేదని ప్రశ్నించారు. ప్రస్తుత ప్రభుత్వం చేసిన అప్పులతో చేపట్టిన ప్రాజెక్టులు, అభివృద్ధి పనుల వివరాలను ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు.

రైతు బంధు, రైతు బీమా, పెన్షన్లు, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఉచిత ప్రసవాలు, కేసీఆర్ కిట్ వంటి పథకాల అమలులో ప్రస్తుత ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.

ధర్మపురి నియోజకవర్గంలో పనులపై విమర్శలు:
ధర్మపురి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు నిలిచిపోయాయని కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. రోళ్లవాగు ప్రాజెక్టు పనులు 95 శాతం పూర్తయినా గేట్లు ఏర్పాటు చేయకపోవడం, అక్కపెల్లి చెరువు, యశ్వంతరావుపేట చెరువు అభివృద్ధి పనులు ప్రారంభించకపోవడం, దొంతాపూర్ రోడ్డు పనులు, మాతా శిశు ఆసుపత్రిలో సిబ్బంది కొరత, లిఫ్ట్ ఇరిగేషన్ పనుల నిర్వహణలో నిర్లక్ష్యంపై ఆయన మండిపడ్డారు.

అక్కపెల్లి చెరువు అభివృద్ధికి రూ.72 కోట్లు, దొంతాపూర్ రోడ్డుకు రూ.32 కోట్లు, క్యాంప్ ఆఫీస్ రోడ్డుకు రూ.16 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. మ్యాదరి గండి మత్తడి పనులకు రూ.6 కోట్లతో టెండర్లు పూర్తయినా పనులు ప్రారంభం కాలేదన్నారు. యశ్వంతరావుపేట చెరువు పూడికతీత, అభివృద్ధికి రూ.5 కోట్లు తీసుకొచ్చినా పనులు ముందుకు సాగడం లేదని ఆరోపించారు.

మేడారం రిజర్వాయర్ నుంచి 14 గ్రామాలకు సాగునీరు అందించే లింక్ కెనాల్ పనులను రూ.12 కోట్లతో పూర్తి చేసినట్లు తెలిపారు. రాయపట్నం, ముత్తురూరు, రాజారం-ధమ్మన్నపేట లిఫ్ట్ ఇరిగేషన్ పనుల నిర్వహణ సక్రమంగా లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.

రైతు సంక్షేమంలో కేసీఆర్‌దే ఘనత:
కేసీఆర్‌ హయాంలో రైతు బంధు ద్వారా ఏడాదికి రూ.10 వేల చొప్పున 80 లక్షల మంది రైతులకు ఆర్థిక సాయం అందించినట్లు కొప్పుల ఈశ్వర్ తెలిపారు. రైతు బీమా కోసం ప్రభుత్వం ఏడాదికి రూ.1,500 కోట్ల ప్రీమియం చెల్లించి రైతు కుటుంబాలకు భరోసా కల్పించిందన్నారు.

ప్రస్తుత ప్రభుత్వం రైతు భరోసా, దళితబంధు, పెన్షన్ల పెంపు, మహిళలకు రూ.2,500 ఆర్థిక సాయం, కళ్యాణలక్ష్మిలో తులం బంగారం వంటి హామీలను విస్మరించిందని ఆరోపించారు.

దివ్యాంగుల సంక్షేమాన్ని విస్మరించారు:
బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో దివ్యాంగుల సంక్షేమ బడ్జెట్‌ను రూ.5 కోట్ల నుంచి రూ.65 కోట్లకు పెంచామని కొప్పుల ఈశ్వర్ తెలిపారు. ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్లు, త్రీ-వీలర్ వాహనాలు, బ్యాటరీ సైకిళ్లు అందించామని గుర్తుచేశారు. ప్రస్తుతం దివ్యాంగుల సంక్షేమ కార్యక్రమాలు నిలిచిపోయాయని విమర్శించారు.

కేసీఆర్‌ హయాంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పోలిస్తే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత, డీసీఎంఎస్‌ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, ధర్మపురి నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular