Friday, September 4, 2026

Buy now

వ్యాపారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: ఎమ్మెల్యే రాజ్‌ ఠాకూర్‌

* గోదావరిఖని వర్తక, వ్యాపార, వాణిజ్య సంఘాలతో ఎమ్మెల్యే ఆత్మీయ సమ్మేళనం

గోదావరిఖని: రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే ఎం.ఎస్‌. రాజ్‌ ఠాకూర్‌ ఆధ్వర్యంలో గోదావరిఖని పట్టణ వర్తక, వ్యాపార, వాణిజ్య సంఘాల ప్రతినిధులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్‌ ఠాకూర్‌ వ్యాపారవేత్తలు, వర్తకులు, వాణిజ్య సంఘాల ప్రతినిధులతో ఆత్మీయంగా సమావేశమై వారి సమస్యలు, అవసరాలు, పట్టణ అభివృద్ధికి సంబంధించిన అంశాలను అడిగి తెలుసుకున్నారు.

గోదావరిఖని పట్టణ అభివృద్ధిలో వ్యాపార, వాణిజ్య వర్గాల పాత్ర ఎంతో కీలకమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పట్టణంలో వ్యాపార కార్యకలాపాలు మరింత విస్తరించేలా వ్యాపారులకు అనుకూలమైన వాతావరణం కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

రామగుండం నియోజకవర్గ అభివృద్ధిలో ప్రతి వర్గాన్ని భాగస్వామ్యం చేస్తూ ముందుకు సాగుతున్నామని రాజ్‌ ఠాకూర్‌ తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులు, రహదారులు, పారిశుధ్యం, తాగునీరు, పట్టణ సుందరీకరణకు ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. గోదావరిఖని పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసి వ్యాపారులకు, ప్రజలకు మెరుగైన వాతావరణం కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు.

ఈ కార్యక్రమంలో రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్‌ పాతపల్లి ఎల్లయ్య, కార్పొరేటర్లు, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, వివిధ వర్తక, వ్యాపార, వాణిజ్య సంఘాల ప్రతినిధులు, ప్రముఖ వ్యాపారవేత్తలు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వ్యాపారవేత్తలు ఎమ్మెల్యే రాజ్‌ ఠాకూర్‌తో తమ అభిప్రాయాలను పంచుకుని, గోదావరిఖని పట్టణ అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. అందరి సహకారంతో గోదావరిఖనిని అభివృద్ధి పథంలో మరింత ముందుకు తీసుకెళ్తామని ఎమ్మెల్యే రాజ్‌ ఠాకూర్‌ పేర్కొన్నారు.

Related Articles

spot_img

Most Popular