Sunday, September 20, 2026

Buy now

కాంగ్రెస్ విఫల పాలనపై పోరుబాట విజయవంతం

* ప్రజా సమస్యలను ఎత్తిచూపుతూ వెయ్యి రోజుల వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాం
* పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి

పెద్దపల్లి : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అన్నివర్గాలను మోసం చేసిందని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి దాసరి మనోహర్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీల అమలు వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకు బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన “పోరుబాట” కార్యక్రమాలు విజయవంతంగా ముగిశాయని ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సహాయం, ప్రతి మహిళకు స్కూటీ, రైతులకు అనేక హామీలు, యువతకు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, రైతు భరోసా, కళ్యాణ లక్ష్మి తదితర పథకాల విషయంలో ఎన్నో హామీలు ఇచ్చిందని గుర్తుచేశారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పూర్తిస్థాయిలో అమలు చేయకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందనన్నారు.

ఆరు గ్యారంటీలు – 420 హామీలు ఏమయ్యాయని ప్రజలు ప్రశ్నిస్తున్నారని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. వెయ్యి రోజుల పాలనలో రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, వృద్ధులు, వికలాంగులు, కార్మికులు, నిరుద్యోగులు ఇలా అన్ని వర్గాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు.

గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, వీధి దీపాలు, మౌలిక వసతులు వంటి స్థానిక సమస్యలు కూడా పరిష్కారానికి నోచుకోవడం లేదన్నారు. బిఆర్ఎస్ ఆధ్వర్యంలో గత కొద్ది రోజులుగా నిర్వహించిన కార్యక్రమాల్లో మహిళల సమస్యలు, రైతుల సమస్యలు, విద్యార్థులు –యువత సమస్యలు, ఆరు గ్యారంటీల వైఫల్యం, స్థానిక సంస్థల్లో పారిశుద్ధ్య సమస్యలు, ఎన్నికల హామీల అమలు వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లామని తెలిపారు.

ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడమే బిఆర్ఎస్ పోరుబాట ప్రధాన ఉద్దేశమని చెప్పారు. ప్రజల పక్షాన బిఆర్ఎస్ నిరంతరం పోరాటం చేస్తుందని, హామీల అమలు జరిగే వరకు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా ఎన్నికల హామీలను గుర్తు చేసుకోవాలని, ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి ప్రజలకు న్యాయం చేయాలన్నారు. లేని పక్షంలో రానున్న రోజుల్లో బిఆర్ఎస్ ఆధ్వర్యంలో మరింత ఉధృతమైన ప్రజా ఉద్యమాలను చేపడతామని మనోహర్ రెడ్డి హెచ్చరించారు.

వెయ్యి రోజుల వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బిఆర్ఎస్ శ్రేణులు ఐక్యంగా పనిచేశాయని, పోరుబాట కార్యక్రమాలను విజయవంతం చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సమస్యలపై పోరాటం కొనసాగుతుందని, bi ప్రజల పక్షాన ఎప్పటికీ నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు.

అంబేద్కర్ విగ్రహానికి వినతి:
కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల విఫల పాలనకు 420 హామీల అమలులో జరుగుతున్న జాప్యం, ఆరు గ్యారెంటీల విస్మరణ పై అంబేద్కర్ విగ్రహానికి ఈ సందర్భంగా దాసరి మనోహర్ రెడ్డి పత్రం సమర్పించారు.

Related Articles

spot_img

Most Popular