* స్వరాష్ట్ర విద్యుత్ అవసరాలకే 90 శాతం బొగ్గు సరఫరా
* ఇతర రాష్ట్రాల నుంచి భారీ డిమాండ్ ఉన్నా తెలంగాణకే తొలి ప్రాధాన్యం
హైదరాబాద్, సెప్టెంబర్ 8: దేశవ్యాప్తంగా విద్యుత్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు అవసరాలు అధికమవుతున్నప్పటికీ సింగరేణి కాలరీస్ సంస్థ తెలంగాణ విద్యుత్ అవసరాలకే అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఇతర రాష్ట్రాల నుంచి సింగరేణి బొగ్గు కోసం భారీగా డిమాండ్ వస్తున్నా.. స్వరాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమన్న విధానంతో తెలంగాణ విద్యుత్ కేంద్రాలకు బొగ్గును నిరంతరాయంగా సరఫరా చేస్తోంది.
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్రంలో నిరంతర విద్యుత్ సరఫరాకు అవసరమైన బొగ్గును సింగరేణి అందిస్తోంది. విద్యుత్ రంగానికి అండగా నిలుస్తూ రాష్ట్ర పారిశ్రామిక, ఆర్థిక ప్రగతికి సంస్థ కీలకంగా మారుతోంది.
ప్రతి పది టన్నుల్లో తొమ్మిది తెలంగాణకే
గత ఆగస్టు నెలలో సింగరేణి దేశంలోని విద్యుత్ సంస్థలకు 40,51,312 టన్నుల బొగ్గును సరఫరా చేయగా, అందులో 36,25,937 టన్నులు తెలంగాణలోని విద్యుత్ సంస్థలకే రవాణా చేసింది. అంటే విద్యుత్ రంగానికి సరఫరా చేసిన బొగ్గులో దాదాపు 90 శాతం తెలంగాణకే అందించింది.
సింగరేణి రోజుకు సగటున 1,30,687 టన్నుల బొగ్గును థర్మల్ విద్యుత్ కేంద్రాలకు సరఫరా చేయగా, తెలంగాణ థర్మల్ కేంద్రాలకు రోజుకు సగటున 1,16,966 టన్నులు అందించింది.
తెలంగాణ జెన్కోకు 50 శాతం సరఫరా
ఆగస్టులో తెలంగాణ జెన్కోకు 382 రైల్వే రేకుల ద్వారా మొత్తం 20,16,356 టన్నుల బొగ్గును సింగరేణి రవాణా చేసింది. రాష్ట్ర విద్యుత్ కేంద్రాలకు సరఫరా చేసిన బొగ్గులో ఇది సుమారు 50 శాతం కావడం విశేషం.
కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్కు 6,99,661 టన్నులు, యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రానికి 7,99,017 టన్నులు, భూపాలపల్లిలోని కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్కు 1,02,959 టన్నులు, భద్రాద్రి థర్మల్ ప్లాంట్కు 4,14,719 టన్నుల బొగ్గును సరఫరా చేసింది.
అలాగే రామగుండం ఎన్టీపీపీ ప్లాంట్లకు 7,28,164 టన్నులు, ఎన్టీపీసీ తెలంగాణ ప్లాంట్కు 4,15,839 టన్నులు, సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ (జైపూర్)కు 4,65,579 టన్నుల బొగ్గును సరఫరా చేసింది.
ఇతర రాష్ట్రాల నుంచి భారీ డిమాండ్
దేశవ్యాప్తంగా విద్యుత్ డిమాండ్ పెరగడంతో సింగరేణి బొగ్గుకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీగా డిమాండ్ వస్తోంది. పశ్చిమ బెంగాల్లోని దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ (డీవీసీ) 10 లక్షల టన్నులు, దుర్గాపూర్లోని ఎన్టీఈసీఎల్ 12 లక్షల టన్నులు, ఎన్ఎస్పీసీఎల్–ఝజ్జర్ 10 లక్షల టన్నులు, తమిళనాడులోని ఎన్టీఈసీఎల్ 20 లక్షల టన్నుల బొగ్గు కోసం సింగరేణిని కోరుతున్నాయి.
అయితే వాణిజ్యపరంగా ఈ అవకాశాలను వినియోగించుకునే అవకాశం ఉన్నప్పటికీ.. రాష్ట్ర విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇతర రాష్ట్రాల డిమాండ్లను పక్కనపెట్టి తెలంగాణ థర్మల్ విద్యుత్ కేంద్రాలకే బొగ్గు సరఫరాకు సింగరేణి ప్రాధాన్యం ఇస్తోంది.
నైనీ బొగ్గును కూడా తెలంగాణకే
ఒడిశాలోని నైనీ బొగ్గు గని నుంచి ఉత్పత్తి చేస్తున్న బొగ్గును కూడా సింగరేణి స్వరాష్ట్ర అవసరాలకు తరలిస్తోంది. ఇప్పటికే సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్కు ఒక్కొక్క రైల్వే రేకును సరఫరా చేసింది.
నైనీలో ప్రస్తుతం 15 లక్షల టన్నుల బొగ్గు వెలికితీతకు సిద్ధంగా ఉన్నప్పటికీ, రైల్వే సైడింగ్కు రాత్రి వేళల్లో మాత్రమే బొగ్గు రవాణాకు అనుమతి ఉండటంతో సరఫరాను మరింత పెంచడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయినప్పటికీ నైనీ బొగ్గును కూడా తెలంగాణ ప్రయోజనాలకే వినియోగిస్తున్నారు.
నిరంతర సరఫరా కోసం ప్రత్యేక అధికారుల నియామకం
రాష్ట్ర విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క సింగరేణి సహా ఇంధన సంస్థలతో ఉన్నతస్థాయి సమన్వయ సమావేశాలు నిర్వహించి తగినంత బొగ్గు సరఫరాపై మార్గనిర్దేశం చేశారు.
ఈ నేపథ్యంలో సింగరేణి యాజమాన్యం బొగ్గు ఉత్పత్తి, రవాణాను పెంచుతోంది. నాణ్యమైన బొగ్గును సకాలంలో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు చేరవేసేందుకు సంస్థ సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి ఐదుగురు ప్రత్యేక అధికారులను పర్యవేక్షణకు నియమించారు.
వారి పర్యవేక్షణలో బొగ్గు ఉత్పత్తి, సీహెచ్పీల ద్వారా సరఫరా, రైల్వే రేకుల సమీకరణ, రవాణా ప్రక్రియలను వేగవంతం చేస్తున్నారు. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పెరిగిన నేపథ్యంలో తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఇతర రాష్ట్రాలకు బొగ్గు సరఫరాను తగ్గించినట్లు సింగరేణి యాజమాన్యం వెల్లడించింది.

