* మండపాల నిర్వాహకులు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే
* డీజేలకు అనుమతి లేదు.. సోషల్ మీడియా పోస్టులపై ప్రత్యేక నిఘా
సిరిసిల్ల: గణేష్ నవరాత్రి వేడుకలను శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే సూచించారు. సిరిసిల్ల పట్టణంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్‌లో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, మండపాల నిర్వాహకులు, స్థానిక కౌన్సిలర్లతో సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. గత ఏడాది గణేష్ నిమజ్జనం సందర్భంగా జిల్లా ప్రజలు పోలీసులకు సహకరించారని తెలిపారు. అక్కడక్కడ ఇబ్బందులకు పాల్పడిన వారిపై ఎనిమిది కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు.
గణేష్ పోర్టల్‌లో మండపాల వివరాలు నమోదు
జిల్లాలోని ప్రతి గణేష్ మండప నిర్వాహకులు గణేష్ పోర్టల్–2026లో తమ మండపానికి సంబంధించిన వివరాలను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని ఎస్పీ సూచించారు. ప్రజా రవాణాకు, అత్యవసర వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మండపాలను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు.
ప్రతి మండపం వద్ద 24 గంటలూ వాలంటీర్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, మండపం వద్ద జరిగే కార్యక్రమాలకు పూర్తి బాధ్యత నిర్వాహకులదేనని స్పష్టం చేశారు. ప్రతి మండపం వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, అన్ని మండపాలను జియో ట్యాగింగ్ చేయనున్నట్లు తెలిపారు.గణేష్ విగ్రహం ఆగమనం సమయంలో 10 అడుగుల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న విగ్రహాల వివరాలను ముందుగానే పోలీస్ శాఖకు తెలియజేయాలని సూచించారు.
నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు:
నిమజ్జనం రోజున మండపం నుంచి నేరుగా నిర్దేశించిన నిమజ్జన ప్రదేశానికి వెళ్లాలని, నిర్ణయించిన సమయానికి నిమజ్జనం పూర్తి చేయాలని ఎస్పీ సూచించారు. సిరిసిల్ల మానేరు తీరంలో ఏర్పాటు చేయనున్న నిమజ్జన ప్రదేశంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన సంఖ్యలో క్రేన్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
నిబంధనలకు లోబడి ఉత్సవాలను నిర్వహించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. మండపాలను పోలీస్ అధికారులు, బ్లూకోల్ట్ సిబ్బంది తరచూ సందర్శిస్తూ పరిస్థితులను పర్యవేక్షిస్తారని తెలిపారు.మండపాల వద్ద మద్యం సేవించడం, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడటం వంటి చర్యలకు పాల్పడే వారితో పాటు వాటిని నియంత్రించడంలో నిర్లక్ష్యం వహించే మండప నిర్వాహకులపై కూడా కేసులు నమోదు చేస్తామని ఎస్పీ స్పష్టం చేశారు.
మండపాలు, శోభాయాత్రలో డీజేలకు అనుమతి లేదు:
గణేష్ నవరాత్రి వేడుకలు, శోభాయాత్ర, నిమజ్జనం సందర్భంగా డీజేలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేదని ఎస్పీ స్పష్టం చేశారు. అనుమతి లేకుండా డీజేలను వినియోగిస్తే డీజే నిర్వాహకులతో పాటు సంబంధిత మండప నిర్వాహకులపై కూడా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా రాత్రి 10 గంటల వరకు మాత్రమే రెండు చిన్న స్పీకర్లను వినియోగించాలని సూచించారు.
సోషల్ మీడియా పోస్టులపై ప్రత్యేక నిఘా:
గణేష్ ఉత్సవాల సందర్భంగా సోషల్ మీడియాలో వచ్చే పోస్టులపై జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తుందని ఎస్పీ తెలిపారు. విద్వేషాలు రెచ్చగొట్టేలా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా పోస్టులు చేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.అలాగే వాస్తవాలను తెలుసుకోకుండా అలాంటి పోస్టులను ఫార్వర్డ్ చేసే వారిపైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో డీఎస్పీ నాగేంద్రచారి, సీఐలు శ్రీనివాస్, నాగేశ్వరరావు, వెంకటేష్, పోలీస్ సిబ్బంది, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు.

