* స్పీకర్ తల్లిని అవమానించిన ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాలి
* కేసీఆర్ సూచన మేరకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీధి రౌడీల్లా ప్రవర్తించారు: ప్రభుత్వ విప్ విజయరమణారావు
హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ పుట్టుకతోనే దళిత వ్యతిరేక వైఖరిని ప్రదర్శిస్తోందని రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ఆరోపించారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ తల్లిని అవమానించేలా వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాత మధు, నవీన్‌రెడ్డిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మంగళవారం అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా విజయరమణారావు మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాల తొలిరోజు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సూచన మేరకు కేటీఆర్, హరీశ్‌రావుతో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హంగామా సృష్టించి వీధి రౌడీల్లా ప్రవర్తించారని విమర్శించారు. ఎంతో సౌమ్యంగా, హుందాగా వ్యవహరించే స్పీకర్ గడ్డం ప్రసాద్ తల్లి పట్ల తాత మధు, నవీన్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు.
ఈ ఘటనపై వారు అసెంబ్లీలో క్షమాపణలు చెబుతారని భావించినప్పటికీ, కేటీఆర్, హరీశ్‌రావులు వారిని వెనుకేసుకురావడం చూస్తే పార్టీ మద్దతుతోనే ఆ వ్యాఖ్యలు చేసినట్లు అర్థమవుతోందని విజయరమణారావు అన్నారు. దళితుల పట్ల బీఆర్ఎస్ నేతల దురహంకార వైఖరికి ఈ ఘటన మరో నిదర్శనమని మండిపడ్డారు.
కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు:
కేసీఆర్ మొదటి నుంచీ దళిత వ్యతిరేక వైఖరిని ప్రదర్శించారని విజయరమణారావు ఆరోపించారు. వర్గీకరణ ఉద్యమం కోసం పోరాడిన దళిత నేత మందకృష్ణ మాదిగను అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేసి చివరకు జైలుకు పంపించారని అన్నారు. ఉప ముఖ్యమంత్రి రాజయ్యను ఎలాంటి కారణం లేకుండా పదవి నుంచి తొలగించారని ఆరోపించారు.దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని హామీ ఇచ్చి ఆ మాటను నిలబెట్టుకోలేదని, ప్రతి దళిత కుటుంబానికి మూడు ఎకరాల భూమి ఇస్తామని చెప్పి అమలు చేయలేదని విమర్శించారు.
నాటి దళిత మంత్రి కొప్పుల ఈశ్వర్ పట్ల కేసీఆర్ వ్యవహరించిన తీరుపై కూడా విజయరమణారావు తీవ్రంగా స్పందించారు. ఓ సమావేశంలో కొప్పుల ఈశ్వర్ తన పక్కన కూర్చున్న సమయంలో కేసీఆర్ చేయి పట్టుకుని దూరంగా నెట్టివేశారన్న ఆరోపణలు అప్పట్లో బడుగు, బలహీన వర్గాలను బాధించాయని పేర్కొన్నారు.
దళిత అధికారుల పట్ల వివక్ష: విజయరమణారావు
గతంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రిటైర్ అయిన పలువురిని వివిధ పదవుల్లో నియమించి గౌరవించారని, అయితే దళితుడైన సతీష్ చంద్ర ఐఏఎస్ అధికారి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రిటైర్ అయిన తర్వాత ఎలాంటి పదవిలోనూ నియమించలేదని విజయరమణారావు ఆరోపించారు.నేరెళ్లలో ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా నిలిచిన దళితులపై అప్పటి ప్రభుత్వం థర్డ్ డిగ్రీ ప్రయోగించిందని ఆయన ఆరోపించారు. కేటీఆర్, సంతోష్‌రావులు ఇసుక మాఫియాతో కుమ్మక్కయ్యారని విమర్శించారు.
ఇలా అనేక సందర్భాల్లో కేసీఆర్ ప్రభుత్వం, బీఆర్ఎస్ నేతలు దళిత వ్యతిరేక వైఖరిని ప్రదర్శించారని విజయరమణారావు అన్నారు. స్పీకర్ తల్లి పట్ల తాత మధు, నవీన్‌రెడ్డి అనుచితంగా ప్రవర్తించిన ఘటన అసెంబ్లీ చరిత్రలో బ్లాక్ డేగా నిలిచిపోతుందని ఆయన వ్యాఖ్యానించారు.స్పీకర్‌ను అవమానించేలా వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవడంతో పాటు వారు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని ప్రభుత్వ విప్ విజయరమణారావు డిమాండ్ చేశారు.

