◆ బీసీ, ఎస్సీ, ఎస్టీ-JAC నాయకులు బింగి రాము యాదవ్, వీరపాగ శివ మహారాజ్ డిమాండ్
ప్రజానావ ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో : రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న 14 వేల కోట్ల రూపాయల విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ-JAC రాష్ట్ర నాయకుడు బింగి రాము యాదవ్, ధర్మ సమాజ పార్టీ నాయకుడు వీరపాగ శివ మహారాజ్ డిమాండ్ చేశారు. బుధవారం వనపర్తి జిల్లా కేంద్రంలో వివిధ కళాశాలల విద్యార్థులతో కలిసి భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు.
అనంతరం పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణం వద్ద దీక్షా శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బింగి రాము యాదవ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో సుమారు 30 లక్షల మంది విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్‌లో ఉండటంతో బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఫీజులు చెల్లించలేక చదువులు మధ్యలోనే ఆగిపోతున్నాయని, కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. వీరపాగ శివ మహారాజ్ మాట్లాడుతూ.. ఈ సమస్య ప్రభావం దాదాపు కోటి కుటుంబాలపై పడిందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బకాయిలను విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ధర్మ స్టూడెంట్ యూనియన్ నాయకులు శివ, సుబ్బయ్య యాదవ్, మధు, సంధ్యారాణి, మన్యం, ధర్మసమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ, కావలి కురుమన్న, అశోక్, ఆంజనేయులు, రవి, రమేష్, తరుణ్ తదితరులు పాల్గొన్నారు.

