* పేదలకు కేటాయించిన భూమిలో మార్కెట్ యార్డు నిర్మాణ యత్నం సరికాదు: కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, సెప్టెంబర్ 9: మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని హిమాయత్‌నగర్ రెవెన్యూ గ్రామంలో 19 ఏళ్ల క్రితం పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చి, ఇప్పటికీ వారికి స్థలాలు కేటాయించకపోవడం తీవ్ర అన్యాయమని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు కేటాయించిన స్థలాలు చూపించాలంటూ పేదలు 75 రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు.
ఈ మేరకు ఆమె ‘ఎక్స్’ వేదికగా ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 19 ఏళ్ల క్రితం పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చిన భూమిలోనే ఇప్పుడు మార్కెట్ యార్డు నిర్మించేందుకు ప్రయత్నించడం సరికాదని స్పష్టం చేశారు. పేదలకు పట్టాలు ఇచ్చి, దాదాపు రెండు దశాబ్దాలుగా స్థలాలు చూపించకపోవడం గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాల వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు.
హిమాయత్‌నగర్ రెవెన్యూ గ్రామంలోని సర్వే నంబర్ 151లో 2007లో 290 మంది పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేశారని కవిత గుర్తుచేశారు. పట్టాలు చేతిలో ఉన్నప్పటికీ ఇప్పటివరకు వారికి స్థలాలు చూపించకపోవడంతో ఇళ్లు నిర్మించుకోలేని పరిస్థితి నెలకొందన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హయాం నుంచి, తెలంగాణ ఏర్పడిన అనంతరం బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాల వద్దకు పట్టాదారులు పలుమార్లు వెళ్లి తమ సమస్యను పరిష్కరించాలని కోరినా ఫలితం లేకుండా పోయిందని ఆమె పేర్కొన్నారు. ఇప్పుడు అదే సర్వే నంబర్‌లో మార్కెట్ యార్డు నిర్మించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.
తమకు కేటాయించిన స్థలాల్లో మార్కెట్ యార్డు నిర్మించవద్దని, పట్టాల్లో పేర్కొన్న స్థలాలను చూపిస్తే తామే ఇళ్లు నిర్మించుకుంటామని పేదలు 75 రోజులుగా దీక్షలు చేస్తున్నారని కవిత తెలిపారు. ప్రభుత్వం ఇకనైనా వారి ఆందోళనను గుర్తించి, వెంటనే స్థలాలను చూపించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
పేదల హక్కుల కోసం తెలంగాణ రక్షణ సేన అండగా నిలుస్తుందని, వారికి కేటాయించిన ఇళ్ల స్థలాలు చూపించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు.

