Wednesday, September 16, 2026

Buy now

బైక్ దొంగతనం.. అదే బైక్‌పై చైన్ స్నాచింగ్!

* పెద్దపల్లిలో వరుస చోరీలకు చెక్.. యూపీకి చెందిన నిందితుడు అరెస్ట్, మరో వ్యక్తి పరారీ

పెద్దపల్లి: పెద్దపల్లి పట్టణంలో వరుసగా చోటుచేసుకున్న చైన్ స్నాచింగ్‌లు, ద్విచక్ర వాహనాల దొంగతనం కేసులను పోలీసులు ఛేదించారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన భవారియా తెగకు చెందిన కలిరామ్ (38)ను అరెస్ట్ చేయగా, మరో నిందితుడు కపిల్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి నుంచి పల్సర్ 220 ద్విచక్ర వాహనం TS02FG3079ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పోలీసుల వివరాల ప్రకారం.. నిందితులు ఉత్తరప్రదేశ్ నుంచి రైలులో వివిధ ప్రాంతాలకు వచ్చి, ముందుగా ఇళ్ల బయట లేదా బహిరంగ ప్రదేశాల్లో పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలను చోరీ చేసేవారు. అనంతరం అదే వాహనాలపై తిరుగుతూ రోడ్లపై ఒంటరిగా కనిపించే మహిళలను లక్ష్యంగా చేసుకుని వారి మెడలోని బంగారు చైన్లు, పుస్తెలతాళ్లు లాక్కొని పరారయ్యేవారు. దొంగిలించిన ఆభరణాలను విక్రయించి వచ్చిన డబ్బుతో జల్సాలు చేసుకునేవారని పోలీసులు వెల్లడించారు.

మార్చి 30న వరుసగా రెండు చైన్ స్నాచింగ్‌లు:
నిందితులు మార్చి 30, 2026న ఉత్తరప్రదేశ్ నుంచి రైలులో పెద్దపల్లి రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. అదే రోజు రాత్రి సుమారు 7 గంటలకు రైల్వే కాలనీలోని ఓ ఇంటి ముందు పార్క్ చేసిన పల్సర్ బైక్‌ను దొంగిలించారు.
అదే బైక్‌పై పెద్దపల్లి మీదుగా రామగుండం వైపు వెళ్తూ రాత్రి సుమారు 8 గంటలకు బంధంపల్లిలో ఇంటి ముందు రోడ్డుపై ఒంటరిగా ఉన్న గుండు నర్సమ్మ మెడలోని సుమారు రెండు తులాల బంగారు పుస్తెలతాడును లాక్కొని పారిపోయారు.

అనంతరం రాత్రి 8.45 గంటల సమయంలో రామగుండం ఓల్డ్ బజార్‌లో మరో మహిళతో మాట్లాడుతున్న కోల కుసుమ మెడలోని సుమారు 45 గ్రాముల బంగారు పుస్తెలతాడును లాక్కొని పరారయ్యారు. ఆ తర్వాత దొంగిలించిన బైక్‌ను బల్హర్ష వద్ద వదిలి రైలులో ఉత్తరప్రదేశ్‌కు వెళ్లిపోయారు.

మే 29న మరో బైక్ చోరీ
నిందితులు మళ్లీ రైలులో పెద్దపల్లికి వచ్చి మే 29న రాత్రి సుమారు 8 గంటలకు పెద్దపల్లి బస్‌స్టాండ్‌ ముందు పార్క్ చేసిన పల్సర్ బైక్‌ను దొంగిలించారు. పెద్దపల్లి, గోదావరిఖని ప్రాంతాల్లో తిరిగినప్పటికీ చైన్ స్నాచింగ్‌కు అవకాశం లభించకపోవడంతో బైక్‌ను బెల్లంపల్లి వద్ద దాచిపెట్టి తిరిగి రైలులో ఉత్తరప్రదేశ్‌కు వెళ్లిపోయారు.

ఆగస్టు 17న మరో చైన్ స్నాచింగ్
ఆగస్టు 17న మళ్లీ రైలులో పెద్దపల్లికి చేరుకున్న నిందితులు రాత్రి సుమారు 8.30 గంటలకు కాలేజీ మైదానం సమీపంలో పల్సర్ బైక్‌ను చోరీ చేశారు. అదే బైక్‌పై పట్టణంలో తిరుగుతూ లక్ష్మీనగర్‌లో రోడ్డుపై ఉన్న నూనె స్వరూప మెడలోని సుమారు 30 గ్రాముల బంగారు పుస్తెలతాడును తెంపుకుని పరారయ్యారు.తర్వాత దొంగిలించిన బైక్‌ను వాంకిడి–బల్హర్ష మధ్య ప్రాంతంలో వదిలి రైలులో ఉత్తరప్రదేశ్‌కు వెళ్లిపోయారు.

సీసీ కెమెరాలు.. సాంకేతిక ఆధారాలతో ఛేదన
వరుస చైన్ స్నాచింగ్‌లు, బైక్ దొంగతనాలకు అడ్డుకట్ట వేసేందుకు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా, ఐపీఎస్ (డీఐజీ), పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి, ఏసీపీ జి. కృష్ణ పర్యవేక్షణలో ప్రత్యేక పోలీస్ బృందాన్ని ఏర్పాటు చేశారు.

ప్రత్యేక బృందం సీసీ కెమెరాల ఫుటేజీలతో పాటు సాంకేతిక ఆధారాలను విశ్లేషించి నిందితులు ఉత్తరప్రదేశ్‌కు చెందిన భవారియా తెగకు చెందిన వారిగా గుర్తించింది. అనంతరం ప్రత్యేక బృందం యూపీకి వెళ్లి నిందితుల కదలికలపై కీలక సమాచారాన్ని సేకరించింది.

నిందితులు తిరిగి పెద్దపల్లి వైపు వస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. గతంలో దొంగిలించి బెల్లంపల్లి వద్ద దాచిన పల్సర్ బైక్‌ను తీసుకుని కలిరామ్ పెద్దపల్లి రైల్వే స్టేషన్‌కు వచ్చి కపిల్ కోసం వేచి ఉండగా పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

అతని వద్ద నుంచి చోరీకి గురైన పల్సర్ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో చైన్ స్నాచింగ్ కేసులకు సంబంధించిన సొత్తు పరారీలో ఉన్న కపిల్ వద్ద ఉన్నట్లు కలిరామ్ వెల్లడించినట్లు డీసీపీ తెలిపారు. కపిల్‌ను అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు పేర్కొన్నారు.

పోలీసు బృందానికి అభినందనలు
నిందితుడిని పట్టుకోవడంలో కీలకంగా పనిచేసిన పెద్దపల్లి సీఐ కె. ప్రవీణ్ కుమార్, ఎస్‌ఐ కె. నరేష్, సీసీఎస్ ఎస్‌ఐ ఎం.డి. నసీర్, హెచ్‌సీ కె. సుధాకర్, పీసీలు కె. ప్రభాకర్, కె. విజయ్ కుమార్, బి. ప్రేమ్ సాగర్‌లను పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి, ఏసీపీ జి. కృష్ణ అభినందించారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ద్విచక్ర వాహనాలను భద్రంగా పార్క్ చేసుకోవాలని పోలీసులు సూచించారు. మహిళలు ఒంటరిగా ప్రయాణించే సమయంలో అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాలు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

Related Articles

spot_img

Most Popular