* ప్రతి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు సమగ్ర కంటి పరీక్షలు.. ‘నో స్కూల్ లెఫ్ట్–నో చైల్డ్ లెఫ్ట్’ లక్ష్యం
సిరిసిల్ల: జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సమగ్ర నేత్ర పరీక్షలు నిర్వహించేందుకు సెప్టెంబర్ 15 నుంచి ప్రత్యేక నేత్ర పరీక్షా శిబిరాలు చేపట్టనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ తెలిపారు.
ఆర్బీఎస్కే కార్యక్రమంపై వైద్యాధికారులు, ఫార్మసిస్టులు, ఏఎన్ఎంలతో డీఎంహెచ్ఓ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. ‘నో స్కూల్ లెఫ్ట్–నో చైల్డ్ లెఫ్ట్’ లక్ష్యంతో జిల్లాలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలలో నేత్ర పరీక్షలు నిర్వహించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు.
విద్యార్థుల్లో దృష్టి లోపాలను ప్రారంభ దశలోనే గుర్తించి, అవసరమైన వారికి కళ్లద్దాలు అందించడంతో పాటు తదుపరి వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నేత్ర పరీక్షలకు సంబంధించిన వివరాలను సక్రమంగా నమోదు చేయడంతో పాటు, అవసరమైన విద్యార్థులకు నిరంతర ఫాలోఅప్ సేవలు అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు.
ప్రతి విద్యార్థి ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ పాఠశాల స్థాయిలోనే ఆరోగ్య సమస్యలను గుర్తించి, సకాలంలో వైద్య సేవలు అందించడం ద్వారా విద్యార్థుల ఆరోగ్యం, విద్యాభ్యాసానికి మెరుగైన పరిస్థితులు కల్పించవచ్చని డీఎంహెచ్ఓ పేర్కొన్నారు.
ఈ సమీక్ష సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ నాగేందర్ బాబు, ఆర్బీఎస్కే ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ నయీమ్జహా, డాక్టర్ సంపత్ కుమార్, డిప్యూటీ మాస్ మీడియా అధికారి కొప్పు ప్రసాద్, డీపీఓ ఎన్హెచ్ఎం రాజేందర్, వైద్యాధికారులు, ఫార్మసిస్టులు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.

