* త్వరలో మండలాల వారీగా సమావేశాలు.. ప్రతి కార్యకర్తతో వన్టువన్గా మాట్లాడతా: జగ్గారెడ్డి
సంగారెడ్డి: పార్టీలో పదవులు దక్కని వారు ఎలాంటి నిరాశకు గురికావద్దని, పదవులు ఉన్నా లేకపోయినా ప్రతి కార్యకర్తను గుర్తించి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు.సంగారెడ్డి పట్టణంలోని క్లాసిక్ గార్డెన్స్‌లో బుధవారం డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి ఆధ్వర్యంలో సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కమిటీల నియామక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని నాలుగు మండలాల కాంగ్రెస్ పార్టీ కమిటీలతో పాటు రెండు మున్సిపాలిటీలకు సంబంధించిన కమిటీలను ప్రకటించారు.
ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళా, ఐఎన్టీయూసీ, కాంగ్రెస్ కిసాన్ సెల్‌తో పాటు ఇతర ఫ్రంటల్ ఆర్గనైజేషన్ల కమిటీలను సైతం ప్రకటించారు. అనంతరం జగ్గారెడ్డి మాట్లాడుతూ.. పార్టీలో పదవులు వచ్చిన వారు, రాని వారు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ సముచిత గుర్తింపు ఉంటుందని తెలిపారు.పార్టీ పదవి దక్కలేదని ఎవరూ నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని, కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీకి బలమని అన్నారు. అందరూ సమన్వయంతో, ఐక్యంగా పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
అధికారులతో వరుస సమీక్షలు
సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై త్వరలో వరుస సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నట్లు జగ్గారెడ్డి వెల్లడించారు. నాలుగు మండలాలకు చెందిన గెలిచిన, ఓడిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులతో అధికారుల సమక్షంలో ప్రత్యేక సమీక్ష సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు.
రెండు మున్సిపాలిటీల ప్రజాప్రతినిధులు, అధికారులతోనూ ప్రత్యేకంగా సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు. సెప్టెంబర్ 30 నుంచి నాలుగు రోజుల పాటు వరుసగా సమావేశాలు నిర్వహించి, ప్రతి కార్యకర్తతో వన్టువన్గా మాట్లాడతానని జగ్గారెడ్డి తెలిపారు.
ఈ సమావేశాలకు పోలీస్ శాఖతో పాటు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులను ఆహ్వానించి ప్రజా సమస్యలు, నియోజకవర్గ అభివృద్ధి అంశాలపై చర్చిస్తామని చెప్పారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగుతూ ప్రజలకు మరింత చేరువ కావాలని జగ్గారెడ్డి సూచించారు.

