* కుట్రపూరిత ఘటనలపై సమగ్ర విచారణ.. బాధ్యులపై క్రిమినల్ కేసులు: అసెంబ్లీలో సీఎం రేవంత్రెడ్డి
హైదరాబాద్: శాసనసభ వర్షాకాల సమావేశాల సందర్భంగా చోటుచేసుకున్న కుట్రపూరిత సంఘటనలపై సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులైన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి దోషులను శిక్షించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి శాసనసభలో వెల్లడించారు.
సభ సమావేశాల తొలిరోజు స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ను ఉద్దేశించి దుర్భాషలాడిన ఘటనతో పాటు, దళితులు నడిచిన నేలను శుద్ధి చేసిన ఘటనలపై శాసనసభలో తీవ్ర ఆందోళన వ్యక్తమైందని సీఎం తెలిపారు. సభాపతిని అవమానించిన ఘటనలో శాసనసభ మొత్తం ఆయనకు అండగా నిలిచిందని పేర్కొన్నారు. ఈ ఘటనలతో మానసికంగా కుంగిపోవద్దని స్పీకర్కు విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు.
బుధవారం శాసనసభలో ఈ అంశాలపై జరిగిన సుదీర్ఘ చర్చకు ముఖ్యమంత్రి సమాధానమిచ్చారు. స్పీకర్కు ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని, ఆయన మనసును గాయపరిచిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
“ఉన్మాదానికి లోనై ఉసిగొల్పబడిన కొంతమంది ముష్కరులు అధికారులపై దాడులు చేయడమే కాకుండా సభాపతి స్థానాన్ని అవమానించేలా వ్యవహరించారు. శాసనసభాపతి తల్లిని అవమానించారు” అని సీఎం వ్యాఖ్యానించారు. ఈ ఘటనను ఒక పథకం ప్రకారం దుర్మార్గమైన ఆలోచనతో జరిగిన దాడిగా అభివర్ణించారు.దేశంపై దాడికి ప్రయత్నించే ఉగ్రవాదులు, తీవ్రవాదులు వ్యవహరించే తీరుకు, శాసనసభ ప్రాంగణంలో సభాపతిని అవమానిస్తూ మాట్లాడిన తీరుకు ఏమాత్రం తేడా లేదని రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు.
తల్లిని అవమానించడం తెలంగాణ సంస్కృతికి విరుద్ధం:
తెలంగాణ సమాజం మాతృస్వామ్య విలువలకు ప్రాధాన్యం ఇస్తుందని సీఎం పేర్కొన్నారు. స్త్రీని అపరకాళి, భద్రకాళి, భూమాత, భారతమాత, తెలంగాణ తల్లి వంటి గౌరవప్రదమైన రూపాల్లో కొలిచే సంప్రదాయం మనదన్నారు. అలాంటి తెలంగాణ నేలపై ఒక తల్లిని అవమానించేలా వ్యవహరించడం అత్యంత దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.
సభాపతికి జరిగిన అవమానం మొత్తం సమాజానికి జరిగిన అవమానంగా భావించాలని అన్నారు. దోషులను తెలంగాణ సమాజం ఉపేక్షించదని హెచ్చరించారు. రజాకార్లను ఎదురించి తరిమికొట్టిన చరిత్ర ఈ గడ్డకు ఉందని గుర్తుచేశారు.
నిరసనకు ప్రజాస్వామ్య మార్గాలున్నాయి:
ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేసేందుకు అనేక మార్గాలు ఉన్నాయని సీఎం అన్నారు. అయితే సభాపతి మనసుకు గాయం చేయాలనే ఉద్దేశంతో బరితెగించి మాట్లాడటం ఏమాత్రం సమర్థనీయం కాదని పేర్కొన్నారు. సభాపతిని అవమానించిన వారిని చట్టపరంగా శిక్షించే విషయంలో ప్రభుత్వం పూర్తి బాధ్యతతో వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు.
ప్రజా సమస్యలపై చర్చను అడ్డుకున్నారు:
సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభమైన శాసనసభ సమావేశాల్లో ప్రజా సమస్యలపై విస్తృతంగా చర్చించాలని ప్రభుత్వం భావించిందని రేవంత్రెడ్డి తెలిపారు. విద్యారంగ సమస్యలు, ధరణిలో జరిగిన అక్రమాలు, 22(ఎ) వంటి అంశాలతో పాటు ప్రతిపక్షాలు లేవనెత్తిన పలు అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
అయితే ప్రజా సమస్యలపై చర్చ జరగకుండా ప్రతిపక్షాలు అడ్డుకున్నాయని సీఎం ఆరోపించారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం సభా కార్యకలాపాలను కొనసాగించాలని భావించిందని ఆయన తెలిపారు.

