* రూ.12.50 లక్షల విలువైన 125 గంజాయి మొక్కలు స్వాధీనం.. ద్విచక్ర వాహనం సీజ్
ఆదిలాబాద్: పత్తి పంట మధ్యలో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని నేరడిగొండ పోలీసులు అరెస్ట్ చేశారు. బోరిగాం గ్రామానికి చెందిన ఆడే కపిల్ (33) పత్తి పంటలో గంజాయి మొక్కలను సాగు చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు దాడి చేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం.. నేరడిగొండ మండలం బోరిగాం గ్రామ శివారులో పత్తి పంట మధ్యలో గంజాయి సాగు చేస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా 4 నుంచి 5 అడుగుల ఎత్తు పెరిగిన 125 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.12.50 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.
గంజాయి సాగుకు ఉపయోగించిన స్ప్లెండర్ ప్లస్ ద్విచక్ర వాహనాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. నిందితుడు ఆడే కపిల్, తండ్రి లాలు ఆడే, బోరిగాం గ్రామం, నేరడిగొండ మండలానికి చెందిన వ్యక్తిగా పోలీసులు వెల్లడించారు.
నిందితుడిపై ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. గంజాయి సాగు, రవాణా, విక్రయాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని ఇచ్చోడా రూరల్ సీఐ సిహెచ్. రమేష్ హెచ్చరించారు.
గంజాయి సాగు చేసే వారికి ప్రభుత్వ పథకాలు అందకుండా సిఫారసు చేస్తామని ఆయన తెలిపారు. మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రజలు పోలీసులకు సహకరించాలని, గ్రామాల్లో ఎవరైనా అక్రమంగా గంజాయి సాగు చేస్తున్నట్లు సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు.

