Sunday, October 4, 2026

Buy now

రాజీ మార్గమే రాజమార్గం.. లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి!

* సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే పిలుపు.. చిన్నచిన్న కేసులతో సమయం, డబ్బు వృథా చేసుకోవద్దని సూచన

సిరిసిల్ల: ఈనెల 12వ తేదీన నిర్వహించనున్న జాతీయ మెగా లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే సూచించారు. రాజీ పడదగిన కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకుని సత్వర న్యాయం పొందాలని ఆయన కోరారు.

జాతీయ మెగా లోక్ అదాలత్‌లో క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, సివిల్ తగాదాలు, ఆస్తి విభజన కేసులు, కుటుంబపరమైన నిర్వాహణ కేసులు, వైవాహిక వివాదాలు, బ్యాంకు రికవరీ కేసులు, విద్యుత్ చౌర్యం కేసులు, చెక్ బౌన్స్ కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్, పెట్టీ కేసులు తదితర రాజీ పడదగిన కేసులను పరిష్కరించుకునే అవకాశం ఉందని ఎస్పీ తెలిపారు.

‘రాజీ మార్గం రాజమార్గం’ అని పేర్కొన్న ఎస్పీ.. చిన్నచిన్న కేసులతో కక్షలు పెంచుకుని విలువైన సమయాన్ని, డబ్బును వృథా చేసుకోవద్దని సూచించారు. న్యాయశాఖ కల్పించిన ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని వివాదాలకు శాశ్వత పరిష్కారం పొందాలని కోరారు.

రాజీ పడదగిన కేసులను పోలీసు అధికారులు, కోర్టు విధులు నిర్వహించే కానిస్టేబుళ్లు, ఇతర పోలీసు సిబ్బంది గుర్తించాలని ఎస్పీ సూచించారు. ఇరువర్గాల వారిని పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించి, రాజీ ద్వారా కేసులను పరిష్కరించుకునేలా అవగాహన కల్పించాలని ఆదేశించారు.

లోక్ అదాలత్ ద్వారా బాధితులకు సత్వర న్యాయం లభించడంతో పాటు ఇరువర్గాల సమయం, ఖర్చు ఆదా అవుతుందని ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు.

Related Articles

spot_img

Most Popular