* జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ )బి. శ్రీరాములు
పెద్దపల్లి : శిక్షణ, జిల్లా విద్యాశాఖ మరియు సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు సిడబ్ల్యూఎస్ఎన్ విద్యార్థుల తల్లిదండ్రుల కోసం జిల్లా స్థాయి కార్యక్రమం గురువారం పెద్దపల్లిలోని శ్రీనివాస గార్డెన్స్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అదనపు కలెక్టర్ (రెవెన్యూ ) బి.శ్రీరాములు హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల సమగ్ర అభివృద్ధి, విద్య, ఆరోగ్యం మరియు భవిష్యత్ అవకాశాల కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు.
సిడబ్ల్యూఎస్ఎన్ విద్యార్థులను కేవలం “దివ్యాంగులు” అని పిలవడం కంటే, వారిలో ఉన్న ప్రత్యేక నైపుణ్యాలను గుర్తించి, ప్రోత్సహించి, వారి ప్రతిభను వెలికితీయడం సముచితమని అన్నారు. తల్లిదండ్రులు పిల్లలపై నమ్మకంతో, ప్రేమతో, ప్రోత్సాహంతో ముందుకు నడిపించాలని సూచించారు. వైకల్యాన్ని అధిగమించి స్ఫూర్తిగా నిలిచిన అంజారెడ్డి కార్యక్రమంలో ప్రత్యేక అతిథిగా పాల్గొన్న అంజారెడ్డి తన జీవిత అనుభవాలను పంచుకున్నారు.
సుమారు 25 సంవత్సరాల క్రితం జరిగిన ప్రమాదంలో రెండు కాళ్లను కోల్పోయినప్పటికీ, ఆత్మవిశ్వాసం, పట్టుదలతో జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగిన తన ప్రయాణాన్ని వివరించారు. ఆయన అందించిన ప్రేరణాత్మక సందేశం సిడబ్ల్యూఎస్ఎన్ విద్యార్థుల తల్లిదండ్రులకు దిక్సూచిగా నిలిచింది. దివ్యాంగుల ప్రతిభకు విద్యే బలమైన సాధనం
డా. మధుసూదన్ రెడ్డి, రిటైర్డ్ ప్రిన్సిపల్, ఎస్ఆర్ఆర్ కళాశాల మాట్లాడుతూ, దివ్యాంగులైన అనేక మంది అధ్యాపకులు తమ ప్రతిభతో ఉన్నతంగా రాణించి, వేలాది మంది విద్యార్థులకు విద్యాబోధన చేసిన అనుభవాలను పంచుకున్నారు. సరైన అవకాశాలు, ప్రోత్సాహం అందిస్తే సిడబ్ల్యూఎస్ఎన్ విద్యార్థులు కూడా సమాజంలో గొప్ప విజయాలు సాధించగలరని తెలిపారు.
తల్లిదండ్రులే సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లలకు అండ హైదరాబాద్‌కు చెందిన ఎన్జీవో ప్రతినిధి హరిబాబు మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల జీవితంలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో గొప్పదని పేర్కొన్నారు. తల్లిదండ్రుల ప్రేమ, సంరక్షణ, ప్రోత్సాహం మరియు అండదండల వల్లే పిల్లలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగగలరని వివరించారు. సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లల శారీరక, మానసిక వికాసంపై సూచనలు డా. ఏ. జగదీష్,
సీనియర్ కన్సల్టెంట్ – నియోనేటల్ & పీడియాట్రిక్ ఎర్లీ ఇంటర్వెన్షన్
(న్యూరో డెవలప్మెంటల్ డిజెబిలిటీస్),
డెవలప్మెంటల్ పీడియాట్రిక్స్,
హెచ్ఓడీ – సిడబ్ల్యూఎస్ఎన్, అపోలో హాస్పిటల్స్, హైదరాబాద్,
సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లల శారీరక, మానసిక, న్యూరో డెవలప్మెంటల్ వికాసానికి అవసరమైన అంశాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు.
పిల్లల అభివృద్ధిలో ప్రారంభ దశలోనే సరైన గుర్తింపు, చికిత్స, శిక్షణ, నిరంతర పర్యవేక్షణ ఎంతో ముఖ్యమని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐ.ఈ. కోఆర్డినేటర్ శ్రీమతి జి. కవిత, ప్లానింగ్ కోఆర్డినేటర్ చేపూరి మల్లేష్ గౌడ్, డా. మధుసూదన్ రెడ్డి, డా. ఏ. జగదీష్, హరిబాబు, మండల విద్యాధికారులు, సిడబ్ల్యూఎస్ఎన్ విద్యార్థుల తల్లిదండ్రులు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. సిడబ్ల్యూఎస్ఎన్ విద్యార్థుల ప్రతిభను గుర్తించి, వారికి సమాన అవకాశాలు కల్పిస్తూ, విద్యా –సామాజిక –ఆరోగ్య పరంగా సమగ్ర అభివృద్ధి సాధించే దిశగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఈ కార్యక్రమం ద్వారా పిలుపునిచ్చారు.

