Saturday, October 3, 2026

Buy now

కాంగ్రెస్ అవకాశం ఇవ్వకపోతే సునీతా లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి రాష్ట్రస్థాయి నాయకులయ్యేవారా?

* సీఎల్పీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించకపోతే సునీతా లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి రాష్ట్రస్థాయి నాయకులుగా ఎదిగేవారా? అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎదిగి, అదే పార్టీకి నష్టం చేకూర్చే విధంగా వ్యవహరించాలనుకోవడం సరికాదని వ్యాఖ్యానించారు.

ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, తీసుకున్న నిర్ణయాలను ప్రజలకు వివరించేందుకు సభ నిర్వహిస్తున్నామని సీఎం తెలిపారు. సీఎల్పీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. శాసనసభ సమావేశాల్లో సభ్యులందరూ తప్పనిసరిగా చర్చల్లో పాల్గొనాలని, హాజరు శాతం తగ్గకుండా చూసుకోవాలని సూచించారు.

ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌ ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌ అధ్యక్షతన సమావేశమై శాసనసభ కార్యకలాపాలు సజావుగా సాగకుండా కుట్ర చేసిందని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. అధికారం కోల్పోయినా అహంకారం వీడకుండా పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులను దూషించారని, మూడు రోజుల పాటు సభ సజావుగా సాగకుండా చేశారని విమర్శించారు.

అధికారులపై అనుచితంగా వ్యవహరించడం, మహిళా అధికారుల సమక్షంలో టీషర్టులు విప్పి ఇబ్బంది కలిగించడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయని సీఎం పేర్కొన్నారు. శాసనసభాపతిని అత్యంత అభ్యంతరకరంగా దూషించారని ఆరోపించారు. నిరసన తెలిపేందుకు ఎస్సీ సెల్ కార్యక్రమం చేపడితే, దళితులు నడిచిన నేలను శుద్ధి చేసి అవమానించారని అన్నారు.

ప్రతిపక్ష కుట్రను బలంగా తిప్పికొట్టి, ప్రభుత్వంపై జరిగిన కుట్రను ప్రజలకు తెలియజేసిన కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలను రేవంత్‌రెడ్డి అభినందించారు. జరిగిన సంఘటనలపై విచారణ చేపట్టినట్లు తెలిపారు.

నియోజకవర్గ సమస్యలను సభలో ప్రస్తావించాలి

ప్రజలు ఇచ్చిన హోదాను సరైన విధంగా ఉపయోగించుకోకపోతే భవిష్యత్తులో రాజకీయంగా రాణించలేరని సీఎం ఎమ్మెల్యేలకు సూచించారు. సభలో తమ నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యలను ప్రస్తావించాలని, అసెంబ్లీ సమావేశాలు జరిగే అన్ని రోజుల్లో సభ్యుల హాజరు సంపూర్ణంగా ఉండేలా చూసుకోవాలని అన్నారు.

అందరికీ వెసులుబాటుగా ఉండేలా అత్యంత చారిత్రక భవనంలో శాసన మండలి నిర్వహిస్తున్నామని తెలిపారు. అసెంబ్లీలో సెంట్రల్‌ హాల్‌ను ప్రారంభించి దానికి దుద్దిళ్ల శ్రీపాదరావు పేరు పెట్టుకున్నామని పేర్కొన్నారు.

పోలీసులపై దాడులపై విమర్శలు

పోలీసు సిబ్బందిలో కేటీఆర్‌ను రేవంత్‌రెడ్డి చూసినట్టున్నారని, అందుకే అంత ఆక్రోశంతో అధికారులపై దాడులు చేశారని సీఎం వ్యాఖ్యానించారు.

కులగణనపై కేంద్రంపై ఒత్తిడి తేవాలి

దేశానికి తెలంగాణ చేపట్టిన కులగణన రోల్‌మోడల్‌గా నిలిచిందని రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ నమూనాలో దేశవ్యాప్తంగా జనగణనలో కులగణన చేపట్టేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని పార్టీ ఎమ్మెల్యేలకు సూచించారు.

ఓటు హక్కును కాపాడుకోవాలి

SIR పేరుతో ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోందని సీఎం ఆరోపించారు. ఎమ్మెల్యేగా గెలవాలనుకునే ప్రతి ఒక్కరూ ఓటు హక్కును కాపాడే అంశాన్ని సీరియస్‌గా తీసుకోవాలని సూచించారు.

తమ ప్రతి ప్రవర్తన రెండోసారి గెలుపుపై ప్రభావం చూపుతుందని, వ్యక్తిగత పనితీరు గెలుపు, ఓటములను ప్రభావితం చేస్తుందని ఎమ్మెల్యేలకు రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. SIR అంశాన్ని సీరియస్‌గా పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.

దేశంలో వయోజనుల జనాభా 103 కోట్లుగా తేల్చారని, అయితే ఓటర్ల జాబితాలో మాత్రం 88 కోట్లుగా చూపిస్తున్నారని సీఎం పేర్కొన్నారు. దేశంలో 15 కోట్ల ఓట్లు గల్లంతయ్యాయని ఆరోపిస్తూ.. ఎక్కడో ఏదో ప్రమాదం పొంచి ఉందని అన్నారు.

వెయ్యి రోజుల పాలనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ సీఎం రేవంత్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. పార్టీ నాయకులు, ఎమ్మెల్యేల సహకారంతో దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అనేక కార్యక్రమాలను చేపట్టామని పేర్కొన్నారు.

Related Articles

spot_img

Most Popular