Sunday, October 4, 2026

Buy now

రామగుండంలో భారీ పరిశ్రమ ఏర్పాటు చేయాలి

* 1×800 మెగావాట్ల పవర్ ప్లాంట్‌ను త్వరగా ఏర్పాటు చేయాలి
* అసెంబ్లీలో ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ విజ్ఞప్తి

హైదరాబాద్: పెద్దపల్లి జిల్లాలో ఐటీ సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ స్వాగతించారు. ఈ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, పెద్దపల్లి జిల్లాలో ఐటీ సెంటర్ ఏర్పాటుకు కృషి చేస్తున్న ప్రభుత్వానికి అసెంబ్లీ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఐటీ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఆయన అభినందించారు.

అదే సమయంలో రామగుండం ప్రాంతానికి ఉన్న అపారమైన వనరులను దృష్టిలో ఉంచుకుని ఇక్కడ భారీ పరిశ్రమలను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కోరారు. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జెన్‌కోకు సంబంధించిన భూములతో పాటు రైతుల భూములను కలిపి సుమారు 1,800 ఎకరాల భూమిని సేకరించినప్పటికీ, అక్కడ పరిశ్రమ ఏర్పాటు కాలేదని ఆయన పేర్కొన్నారు.

రామగుండంలో ఎల్లంపల్లి నీరు, విద్యుత్, ఎన్‌టీపీసీ, బొగ్గు వంటి కీలక వనరులు అందుబాటులో ఉన్నాయని, ఇలాంటి అన్ని సౌకర్యాలు ఒకే ప్రాంతంలో ఉండటం రామగుండం ప్రత్యేకత అని రాజ్ ఠాకూర్ తెలిపారు. ఈ నేపథ్యంలో రామగుండంలో భారీ పరిశ్రమను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.అదేవిధంగా రామగుండంలో 1×800 మెగావాట్ల పవర్ ప్లాంట్‌ను త్వరగా ఏర్పాటు చేయాలని అసెంబ్లీ వేదికగా ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.

గతంలో రామగుండం ప్రాంతం “మాంచెస్టర్ ఆఫ్ ఇండియా”గా పేరుగాంచిన పారిశ్రామిక ప్రాంతమని ఆయన గుర్తుచేశారు. తిరిగి రామగుండాన్ని పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చేసి పూర్వ వైభవాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు.

Related Articles

spot_img

Most Popular