* సెప్టెంబర్ 12, 13 తేదీల్లో సికింద్రాబాద్–సిర్పూర్ కాగజ్‌నగర్, సిర్పూర్ కాగజ్‌నగర్–హైదరాబాద్ మధ్య జనసాధారణ్ రైళ్లు
పెద్దపల్లి: పండుగల సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సికింద్రాబాద్–సిర్పూర్ కాగజ్‌నగర్, సిర్పూర్ కాగజ్‌నగర్–హైదరాబాద్ మధ్య జనసాధారణ్ (అన్‌రిజర్వ్‌డ్) ప్రత్యేక రైళ్లను నడపాలని దక్షిణ మధ్య రైల్వేను కోరినట్లు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు.
దీంతో సెప్టెంబర్ 12, 13 తేదీల్లో రెండు రోజుల పాటు ప్రత్యేక రైళ్లను నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే అనుమతించినట్లు వెల్లడించారు. ఈ రైళ్లతో సిర్పూర్ కాగజ్‌నగర్, ఆసిఫాబాద్ రోడ్, బెల్లంపల్లి, మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లి, జమ్మికుంట, కాజీపేట, జనగాం, భువనగిరి, చర్లపల్లి, హైదరాబాద్ ప్రాంతాల ప్రయాణికులకు ప్రయోజనం కలగనుంది.
పండుగల సమయంలో సామాన్య ప్రయాణికులకు రైలు ప్రయాణ సౌకర్యం మెరుగుపర్చేందుకు ప్రత్యేక రైళ్లు, ఇతర రైల్వే సౌకర్యాల కోసం కృషి కొనసాగిస్తానని ఆయన తెలిపారు. ప్రత్యేక రైళ్లకు అనుమతి ఇచ్చిన దక్షిణ మధ్య రైల్వే అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.

