Wednesday, May 14, 2025

Buy now

జనరిక్ మందులకు ఎందుకంత తక్కువ ధరనో తెలుసా?

అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వైద్యుడు జనరిక్ మందులను వాడితే ఆరోగ్య ఖర్చును 70శాతం తగ్గించవచ్చు. ఇప్పటికే ఈ విషయాన్ని ఎన్నో సర్వే సంస్థలు నిర్ధారించాయి. మన దేశంలో జనరిక్ మందుల వినియోగ శాతం కేవలం 10 -12 శాతమే.

అయితే చాలామంది వైద్యులు వీటిని సూచించేందుకు ముందుకు రావడం లేదనేది జగమెరిగిన సత్యం. బ్రాండెడ్ మందులతో పోలిస్తే జనరిక్ మందులు ధర చాలా తక్కువ. ఎంతలా అంటే బ్రాండెడ్ మందులు ధర రూ.100 ఉంటే జనరిక్ మందులు ధర కేవలం రూ.10కి మాత్రమే దొరుకుతుంది. ఇది పేదలకు ఓ వరం లాంటిదే.

ఒక టాబ్లెట్‌ను లేదా సిరప్‌ను కనిపెట్టడానికి ఎన్నో ఫార్మా కంపెనీలు పరిశోధనలు చేస్తాయి. కొన్నేళ్ల పాటు ట్రయల్స్ నిర్వహిస్తాయి. ఆ పరీక్షలన్నీ పూర్తయిన తర్వాత వాటికి ఒక ధర నిర్ణయించి మార్కెట్లోకి విడుదల చేస్తాయి.

ఆ ఫార్మా కంపెనీ పేరు మీదే ఈ మందుల అమ్మకాలు జరుగుతాయి. అంటే ఆ ఫార్మా కంపెనీ అనేది ఒక బ్రాండ్. అయితే సదరు కంపెనీకి ఆ మందుపై దాదాపు 20 ఏళ్ల పాటు పేటెంట్ హక్కు ఉంటుంది. ఆ మందు తయారు చేసిన ఫార్ములాను కంపెనీ ఎవరికీ చెప్పదు.

ఎందుకంటే ఆ మందు తయారీకి తమ ఎంతో ఖర్చు పెట్టామని.. ఆ ఖర్చులు మొత్తం రాబట్టుకోవాలంటే ఆ మందును తామే నిర్ణయించిన ధరలకు అమ్మాలనేది కంపెనీ భావన. అదే ఉద్దేశంతో ప్రభుత్వాలు కూడా సదరు కంపెనీకి పేటెంట్ హక్కును కల్పిస్తాయి.

అయితే ఫార్మా కంపెనీలో తయారుచేసిన మందులు 20 ఏళ్ల తర్వాత పేటెంట్ హక్కును కోల్పోతే ఆ మందును అదే ఫార్ములాతో ఎవరైనా తయారు చేయవచ్చు. వాటికి ఎలాంటి బ్రాండ్ ఉండదు. సాధారణ ఫార్మా సంస్థలు కూడా అదే ఫార్ములాతో మందులు తక్కువ రేటుకే తయారు చేస్తాయి.

ఆ మందులే జనరిక్ మందులు. ఇవి బ్రాండెడ్ మందుల్లాగే పనిచేస్తాయి. కాకపోతే వీటి ధర తక్కువ. వీటిని కేవలం జనరిక్ మందుల షాపుల్లో మాత్రమే అమ్ముతారు. చాలామంది బ్రాండెడ్ మందులు వాడితేనే రోగాలు తగ్గుతాయని అనుకుంటారు.

నిజానికి జనరిక్ మందులు వాడినా కూడా రోగాలు తగ్గుతాయి. ఎందుకంటే ఈ రెండు మందులు కూడా ఒకే ఫార్ములాతో తయారుచేస్తారు. జనరిక్ మందుల షాపులు ఎక్కడపడితే అక్కడ ఉండవు. కేంద్ర ప్రభుత్వ సహాయంతో కొంతమంది మాత్రమే జనరిక్ మందులు షాపులను ఏర్పాటు చేస్తున్నారు.

Related Articles

spot_img

Most Popular