Thursday, August 27, 2026

Buy now

హిమాలయ రాష్ట్రాల్లో వర్ష బీభత్సం

– జమ్మూకశ్మీర్‌లో రెండ్రోజుల్లో 23 మంది మృతి.. ఏడుగురి గల్లంతు
– ఉత్తరాఖండ్‌లో 150 రహదారులు మూసివేత
– తాత్కాలికంగా నిలిచిపోయిన చార్‌ధామ్‌ యాత్ర

న్యూఢిల్లీ: హిమాలయ ప్రాంత రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు తీవ్ర నష్టాన్ని మిగులుస్తున్నాయి. జమ్మూకశ్మీర్‌లో వర్షాలు, కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదల కారణంగా సోమవారం మరో 11 మంది ప్రాణాలు కోల్పోవడంతో గత రెండు రోజుల వ్యవధిలో మరణాల సంఖ్య 23కు చేరింది. పూంచ్‌, రాజౌరి జిల్లాల్లో మరో ఏడుగురు గల్లంతవగా, వారిని గుర్తించేందుకు సహాయక బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఉత్తరాఖండ్‌లో నిరంతర వర్షాల ప్రభావంతో నాలుగు జాతీయ రహదారులు సహా సుమారు 150 రహదారులపై రాకపోకలు నిలిచిపోయాయి. భద్రతా కారణాల దృష్ట్యా చార్‌ధామ్‌ యాత్రను తాత్కాలికంగా నిలిపివేసిన రాష్ట్ర ప్రభుత్వం, అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటించింది. హిమాచల్‌ప్రదేశ్‌లోనూ వర్షాల ప్రభావం తీవ్రంగానే కనిపిస్తోంది. కాంగ్రా, మండి, సిర్మౌర్‌ జిల్లాల్లో విద్యాసంస్థలను మూసివేయగా, 36 రహదారులు దెబ్బతిన్నాయి. అదేవిధంగా 43 తాగునీటి పథకాలు, ఐదు విద్యుత్‌ ట్రాన్స్​‍ఫార్మర్లు దెబ్బతినడంతో పలు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

భారీ నుంచి అతి భారీ వర్షాలు
ఇదిలా ఉండగా, భారత వాతావరణ శాఖ (ఐఎండీ) జమ్మూకశ్మీర్‌, హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఉత్తరాఖండ్‌, బిహార్‌, అసోం, మేఘాలయ రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశముందని తెలిపింది. రాబోయే నాలుగు నుంచి ఐదు రోజుల పాటు వాయవ్య, ఈశాన్య భారతంలో రుతుపవనాల ప్రభావం కొనసాగనున్న నేపథ్యంలో ఢిల్లీ, పంజాబ్‌, హర్యానా, అసోం తదితర రాష్ట్రాలకు కూడా భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేయడంతో ఆయా రాష్ట్రాల యంత్రాంగాలు అప్రమత్తమయ్యాయి.

Related Articles

spot_img

Most Popular