Friday, September 4, 2026

Buy now

ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలకు ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ హాజరు

ఇల్లంతకుంట: పేద కుటుంబాల సొంతింటి కల సాకారమవుతున్న వేళ వారి కళ్లల్లో కనిపించే ఆనందాన్ని చూడటం ద్వారా పొందే అనుభూతి అనిర్వచనీయమని మానకొండూర్ ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డా. కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు.

ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకున్న 40 మంది లబ్ధిదారులు శనివారం నిర్వహించిన గృహప్రవేశ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నూతన గృహాల్లోకి అడుగుపెట్టిన లబ్ధిదారులను ఆయన అభినందించి, వారి కుటుంబాలతో కలిసి గృహప్రవేశ వేడుకల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఇల్లంతకుంటలో 40 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు తమ సొంత ఇళ్లలోకి అడుగుపెట్టడం, వారి ఆనందోత్సవాల్లో తాను భాగస్వామి కావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఎన్నో ఏళ్లుగా సొంతింటి కోసం ఎదురుచూస్తున్న పేద కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలిచి వారి కలను సాకారం చేస్తోందని తెలిపారు.

గృహప్రవేశాల సందర్భంగా లబ్ధిదారుల కుటుంబ సభ్యుల కళ్లల్లో కనిపించిన ఆనందం తనను ఎంతో సంతోషానికి గురిచేసిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పేద కుటుంబాలకు సొంత ఇల్లు కల్పించి, వారి జీవితాల్లో భద్రత, ఆత్మగౌరవం, ఆనందం నింపడమే ఇందిరమ్మ ఇళ్ల పథకం లక్ష్యమని అన్నారు. ఈ సంతోషాన్ని, ఆత్మగౌరవాన్ని పేద ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు.

“ఇది కేవలం ఇల్లు కాదు.. ఒక భరోసా. ఇందిరమ్మ ఇళ్లు పేదవాడి ఆత్మగౌరవానికి ప్రతీక” అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గత ప్రభుత్వం పేదల ఇళ్ల కలను కల్లలుగా మిగిల్చిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసిందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ దశలవారీగా ఇళ్లు అందిస్తామని స్పష్టం చేశారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకుని గృహప్రవేశాలు నిర్వహించుకున్న కుటుంబాలకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా కొత్త ఇళ్లలోకి అడుగుపెట్టిన లబ్ధిదారులు తమ ఆనందాన్ని ఎమ్మెల్యేతో పంచుకున్నారు. తమ సొంతింటి కల నెరవేరేందుకు సహకరించిన ప్రభుత్వానికి, అధికారులకు, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికుల సందడితో గృహప్రవేశ కార్యక్రమాలు ఆనందోత్సాహాల మధ్య జరిగాయి.

ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి శశికళ, తహసీల్దార్ సురేష్, హౌసింగ్ డీఈ సాజిద్, ఇల్లంతకుంట సర్పంచ్ మామిడి రాజు, ఇల్లంతకుంట ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్ ఊట్కూరి వెంకటరమణారెడ్డి, రేపాక, రామోజీపేట, వల్లంపట్ల, వెంకట్రావుపల్లి సర్పంచులు కాత మల్లేశం, చొప్పరి భూమయ్య, నేరెళ్ల విజయ్ గౌడ్, చల్ల నవీన్ రెడ్డి, పార్టీ నాయకులు పసుల వెంకటి, ఎలగందుల ప్రసాద్, తిరుపతి, తూముకుంట రాజేందర్ రెడ్డి, బాల్ రెడ్డి, సుధాకర్ రెడ్డితో పాటు వివిధ గ్రామాల పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular