Monday, August 24, 2026

Buy now

ఎస్ఐఆర్ డ్రాఫ్ట్ ఓటర్ జాబితాపై బీఎల్‌ఏలకు దాసరి మనోహర్ రెడ్డి దిశానిర్దేశం

* అర్హత ఉన్న ఒక్క ఓటరు కూడా ఓటు హక్కు కోల్పోకుండా అప్రమత్తంగా పనిచేయాలి

పెద్దపల్లి : ఎస్ఐఆర్ లో భాగంగా ఆగస్టు 17న డ్రాఫ్ట్ ఓటర్ జాబితా విడుదలైన నేపథ్యంలో పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం మాజీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఎల్‌ఏల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి బూత్ పరిధిలో డ్రాఫ్ట్ ఓటర్ జాబితాను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు.

అర్హత ఉన్నప్పటికీ పేరు జాబితాలో రాని వారు, పేరు లేదా ఇతర వివరాల్లో తప్పులు ఉన్న వారు, చిరునామా మార్పు జరిగిన వారు ఎవరైనా ఉంటే గుర్తించి వారికి అవసరమైన సహాయం అందించాలని తెలిపారు. పేరు జాబితాలో లేని అర్హులైన వారికి ఫారం–6, ఓటరు వివరాల్లో సవరణలకు ఫారం–8, నిబంధనల ప్రకారం అనర్హమైన/డూప్లికేట్ నమోదులపై అభ్యంతరాలకు ఫారం–7 ద్వారా దరఖాస్తు చేసే విధానంపై ఓటర్లకు అవగాహన కల్పించాలని సూచించారు.

అవసరమైన ఫారాలను పూరించడంలో సహాయం చేసి, సంబంధిత బిఎల్ఓలకు అందజేయడంతో పాటు అందుబాటులో ఉన్న అధికారిక ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకునేలా కూడా సహకరించాలని అన్నారు.
ప్రతి కుటుంబంలోని ఓటర్ల పేర్లను పరిశీలించడంతో పాటు కొత్తగా 18 సంవత్సరాలు నిండిన యువత, వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు, ఇతర అర్హులైన ఓటర్ల పేర్లు జాబితాలో ఉన్నాయా లేదా ప్రత్యేకంగా పరిశీలించాలని బీఎల్‌ఏలకు దిశానిర్దేశం చేశారు. “ఓటు హక్కు ప్రతి పౌరుడి హక్కు.

అర్హత కలిగిన ఒక్క ఓటరు పేరు కూడా పొరపాటున జాబితా నుంచి తొలగిపోకుండా బీఆర్‌ఎస్ శ్రేణులు బాధ్యతగా పనిచేయాలి. డ్రాఫ్ట్ జాబితా అనంతరం అందుబాటులో ఉన్న క్లెయిమ్స్, అభ్యంతరాల ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలి” అని దాసరి మనోహర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఎల్‌ఏలతో పాటు ఆయా మండలాల మండల అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు, పార్టీ ముఖ్య నాయకులు, ఇతర నాయకులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular