* చిన్నారెడ్డిపై ఖర్గేకు ఎమ్మెల్యే మేఘారెడ్డి ఫిర్యాదు!
* చిన్నారెడ్డిపై చర్యలు తీసుకోలని ఖర్గేకు వినతి
ప్రజానావ ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జి. చిన్నారెడ్డిపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఫిర్యాదు చేశారు. శుక్రవారం ఢిల్లీలోని ఖర్గే నివాసంలో వనపర్తి జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మున్సిపల్ చైర్మన్లు, పట్టణ, మండల అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయనను కలిశారు.
కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీపై చిన్నారెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా, ఎమ్మెల్యే బీ-ఫారమ్లను డబ్బులకు అమ్ముకున్నారంటూ ఆరోపణలు చేసినందుకు ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఎమ్మెల్యే ఫిర్యాదుపై సానుకూలంగా స్పందించిన ఖర్గే.. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు మేఘారెడ్డి తెలిపారు.

