◆ ప్రాజెక్టుల నీటిని వృధా చేయొద్దు
◆ గూడెం దొడ్డి భూసేకరణ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలి
ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో : రైతులకు చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందేలా నీటిపారుదల శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆదేశించారు. గద్వాలలోని తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎల్నినో, వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా నీటిని వృథా చేయకుండా వారబందీ పద్ధతిలో విడుదల చేయాలని, రైతులు ఆరుతడి పంటలు వేసుకునేలా ప్రోత్సహించాలని సూచించారు.
నారాయణపూర్ నుంచి జూరాలకు నీరు రానున్నందున నియోజకవర్గంలోని రిజర్వాయర్లు, చెరువులను త్వరగా నింపాలన్నారు. అలాగే సోమనాద్రి గట్టు ఎత్తిపోతల సామర్థ్యాన్ని 3 టీఎంసీలకు పెంచే డిపిఆర్ పనులను, 15 టీఎంసీలకు పెంచుతున్న గూడెం దొడ్డి రిజర్వాయర్ భూసేకరణ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

