Wednesday, July 15, 2026

Buy now

కేసుల దర్యాప్తు వేగవంతం చేసి నిందితులకు శిక్షలు పడేలా కృషి చేయాలి: జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే

సిరిసిల్ల : ప్రతి కేసులో దర్యాప్తును వేగవంతం చేసి, శాస్త్రీయ ఆధారాలతో నాణ్యమైన విచారణ చేపట్టి నిందితులకు శిక్షలు పడేలా ప్రతి అధికారి కృషి చేయాలని సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఆదేశించారు.

మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో సిరిసిల్ల సబ్‌డివిజన్ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతి, నిందితుల అరెస్టులు, నాన్‌-బెయిలబుల్ వారెంట్ల అమలు, శాంతిభద్రతల నిర్వహణ, పోలీసు సిబ్బంది పనితీరును సమగ్రంగా సమీక్షించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ప్రతి కేసులో శాస్త్రీయ, సాంకేతిక ఆధారాలు, ఫోరెన్సిక్ సాక్ష్యాలు, డిజిటల్ ఎవిడెన్స్‌ను సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు. నాణ్యమైన దర్యాప్తు ద్వారానే కోర్టుల్లో నిందితులకు శిక్షలు పడతాయని, బాధితులకు పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుపై వెంటనే స్పందించి, చట్టపరిధిలో బాధితులకు సత్వర న్యాయం అందించాలని అధికారులను ఆదేశించారు.

పెట్రోలింగ్ సమయంలో అనుమానితులు, పాత నేరస్తులు, రౌడీషీటర్లను మొబైల్ సెక్యూరిటీ చెక్ డివైస్ ద్వారా తప్పనిసరిగా తనిఖీ చేసి నేరాల నియంత్రణను మరింత సమర్థవంతంగా చేపట్టాలని సూచించారు.

సైబర్ నేరాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడంతో పాటు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించి సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయాలని చెప్పారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సాంకేతికతను వినియోగిస్తూ నేరాలను వేగంగా ఛేదించి బాధితులకు సత్వర న్యాయం అందించాలన్నారు.

గంజాయి, గుడుంబా, పేకాట, పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా, అక్రమ ఇసుక రవాణా వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఉంచి దాడులు నిర్వహించి వాటిని పూర్తిగా అరికట్టాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో డీఎస్పీలు నాగేంద్రచారి, వెంకటేశ్వర్లు, సీఐలు శ్రీనివాస్, నాగేశ్వరరావు, వెంకటేష్, మొగిలి, మధుకర్, ఆర్‌ఐ సురేష్, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular