Wednesday, July 15, 2026

Buy now

బండారి మారుతిపై పీడీ ఉత్తర్వులకు రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం

రామగుండం: ప్రివెన్షన్ ఆఫ్ బ్లాక్ మార్కెటింగ్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ సప్లై ఆఫ్ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్–1980 ప్రకారం రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా బండారి మారుతి (తండ్రి: మల్లయ్య)పై జారీ చేసిన నిరోధాత్మక నిర్బంధ (పీడీ) ఉత్తర్వులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

ఈ మేరకు సాధారణ పరిపాలన (ప్రత్యేక శాంతిభద్రతలు) శాఖ జి.ఓ.ఆర్.టి. నెం.1013, తేదీ 13-07-2026న ఉత్తర్వులు జారీ చేసింది. రామగుండం పోలీస్ కమిషనర్ 06-07-2026న జారీ చేసిన పీడీ ఉత్తర్వులను చట్టబద్ధంగా పరిశీలించిన అనంతరం ప్రభుత్వం అధికారికంగా ఆమోదం తెలిపినట్లు కమిషనర్ అంబర్ కిషోర్ ఝా వెల్లడించారు. దీంతో బండారి మారుతిపై అమలులో ఉన్న నిరోధాత్మక నిర్బంధ ఉత్తర్వులు కొనసాగనున్నాయి.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు నిజమైన లబ్ధిదారులు, పేద ప్రజలకు చేరేలా చూడడం, ప్రజల ప్రయోజనాలను పరిరక్షించడం, ప్రభుత్వ ఆదాయాన్ని కాపాడడం పోలీస్ శాఖ బాధ్యత అని పేర్కొన్నారు.

ప్రభుత్వ విధానాలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ వనరులను అక్రమంగా మళ్లించడం, నిత్యావసర వస్తువులను బ్లాక్ మార్కెటింగ్ చేయడం, ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగించడం, ప్రజలను ఇబ్బందులకు గురిచేసే ఎలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలనైనా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అక్రమ కార్యకలాపాల్లో ప్రమేయం ఉన్న వారిని గుర్తించి చట్టపరిధిలో కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే పీడీ చట్టాన్ని కూడా అమలు చేస్తామని తెలిపారు.

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో నకిలీ విత్తనాల అక్రమాలపై ఇప్పటికే పీడీ చట్టం కింద చర్యలు చేపట్టామని గుర్తు చేశారు. ప్రభుత్వ విధానాలకు విరుద్ధంగా వ్యవహరించి పేద ప్రజల హక్కులకు భంగం కలిగించే, ప్రజల సంక్షేమాన్ని దెబ్బతీసే, ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగించే, అక్రమ లాభాల కోసం చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు, ముఠాలు, వ్యాపారులు ఎంతటి వారైనా చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని పోలీస్ కమిషనర్ హెచ్చరించారు.

Related Articles

spot_img

Most Popular