Wednesday, July 15, 2026

Buy now

ప్రజలకు సత్వర న్యాయం అందేలా కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి: వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత

వరంగల్: ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు నిర్వహించి, బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ అధికారులను ఆదేశించారు.

మంగళవారం పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో స్థానిక కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (కిట్స్) కళాశాల సమావేశ మందిరంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీసు అధికారులతో నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కమిషనరేట్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న వివిధ రకాల కేసులు, వాటి దర్యాప్తు పురోగతి, కేసుల ఛేదన, శాంతిభద్రతల పరిస్థితి, మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల నివారణ, సైబర్ నేరాల నియంత్రణ, మాదకద్రవ్యాల నిర్మూలన, ట్రాఫిక్ నిర్వహణ తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించారు.

సమావేశంలో పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, పెండింగ్ కేసుల దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేసి, నిందితుల అరెస్టుపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. చోరీ కేసుల్లో స్వాధీనం చేసుకున్న ఆస్తులను చట్టపరమైన ప్రక్రియ పూర్తయిన వెంటనే బాధితులకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

మాదకద్రవ్యాల నియంత్రణలో భాగంగా పాఠశాలల పరిసరాల్లో గుట్కా, సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల విక్రయాలను అరికట్టేందుకు ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని సూచించారు. ప్రజల నుంచి అందే ప్రతి ఫిర్యాదును నమోదు చేసి, వెంటనే విచారణ అధికారిని నియమించి నిర్ణీత గడువులో నాణ్యమైన విచారణ పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే డయల్-100 ద్వారా వచ్చే ప్రతి ఫిర్యాదుపై తక్షణమే స్పందించి బాధితులకు సకాలంలో సేవలు అందించాలని పేర్కొన్నారు.

అందుబాటులో ఉన్న మానవ వనరులను సమర్థవంతంగా వినియోగిస్తూ ప్రజలకు మెరుగైన పోలీసింగ్ అందించాలని కమిషనర్ సూచించారు. భూ వివాదాలకు సంబంధించిన కేసుల్లో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (ఎస్‌ఓపీలు)ను తప్పనిసరిగా పాటిస్తూ చట్టబద్ధంగా వ్యవహరించాలని తెలిపారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే వ్యక్తులపై నిరంతర నిఘా ఉంచి, అవసరమైన చోట రౌడీషీట్లు తెరవాలని ఆదేశించారు.

ప్రజల భద్రత, బాధితులకు సత్వర న్యాయం అందించడమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ స్పష్టం చేశారు.

Related Articles

spot_img

Most Popular