Friday, September 4, 2026

Buy now

దేవదుర్గ గని నుంచి బంగారం, రాగి వెలికితీసి దేశ సంపద పెంచుదాం

* త్వరితగతిన ఖనిజ అన్వేషణ పూర్తి చేయాలి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
* దేవదుర్గలో కాపర్, గోల్డ్ మైనింగ్ అన్వేషణకు అధికారిక శ్రీకారం
* సైట్ క్యాంప్ ఆఫీస్, హెలిప్యాడ్ ఏర్పాటు చేయాలని సింగరేణి అధికారులకు ఆదేశం

రాయచూర్: కర్ణాటకలోని దేవదుర్గ గని నుంచి పెద్ద ఎత్తున బంగారం, రాగి ఖనిజాలను వెలికితీసి దేశ సంపదను పెంపొందించేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. రాయచూర్ జిల్లా దేవదుర్గ తాలూకా లింగదహళ్లి గ్రామంలో సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన కాపర్, గోల్డ్ మైనింగ్ అన్వేషణ కార్యక్రమాన్ని ఆయన అధికారికంగా ప్రారంభించారు.

అనంతరం ఖనిజ అన్వేషణ ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన భట్టి విక్రమార్క.. అన్వేషణ పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. సుమారు 136 సంవత్సరాల సుదీర్ఘ మైనింగ్ అనుభవం కలిగిన సింగరేణి సంస్థ కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన టెండర్ల ద్వారా దేవదుర్గ్ బ్లాక్ ఎక్స్‌ప్లోరేషన్ హక్కులను దక్కించుకున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

* అన్వేషణ పనులకు వేగం
దేవదుర్గలో ఖనిజ అన్వేషణ పనులను సింగరేణి సంస్థ మరింత వేగవంతం చేయాలని భట్టి విక్రమార్క సూచించారు. స్థానికుల సహకారంతో అన్వేషణ కార్యక్రమాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇక్కడ బంగారం, రాగి నిక్షేపాలు విరివిగా లభిస్తే ప్రాంతీయంగా నిరుద్యోగ యువతకు భారీగా ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు ఈ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

అన్వేషణ పనులను నిరంతరం పర్యవేక్షించేందుకు సింగరేణి ఆధ్వర్యంలో దేవదుర్గలోనే సైట్ క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. స్థానిక రెవెన్యూ అధికారులు స్థలాన్ని కేటాయించిన వెంటనే కార్యాలయ నిర్మాణ పనులు ప్రారంభించాలని సూచించారు. రాకపోకల సౌకర్యార్థం హెలిప్యాడ్‌ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

* రెండు రాష్ట్రాల ప్రజల మధ్య చారిత్రక బంధం
కృష్ణానదికి ఇరువైపులా నివసించే తెలుగు, కర్ణాటక ప్రజల మధ్య విడదీయరాని చారిత్రక, సాంస్కృతిక అనుబంధం ఉందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఒకప్పుడు ఈ ప్రాంతం హైదరాబాద్ రాష్ట్రంలో భాగంగా ఉండేదని, అందువల్ల ఇక్కడి ప్రజల మూలాలు ఒక్కటేనని గుర్తుచేశారు.

స్థానిక ప్రజల సహకారం, అండదండలతో దేవదుర్గ ఖనిజ అన్వేషణ ప్రాజెక్టును విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ అన్వేషణ కార్యక్రమం రెండు రాష్ట్రాల అభివృద్ధికి, దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి దోహదపడుతుందని ఆకాంక్షించారు.

* దేవదుర్గతో ప్రత్యేక అనుబంధం

సింగరేణి సంస్థ చైర్మన్, ఎండీ డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి మాట్లాడుతూ.. దేవదుర్గ ప్రాంతంతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. గతంలో ఈ ప్రాంతంలో సీఐగా పనిచేశానని గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం సింగరేణి సంస్థ చైర్మన్, ఎండీగా ఇదే ప్రాంతంలో బంగారం, రాగి ఖనిజ అన్వేషణ పనులను స్థానికుల సమక్షంలో ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు.

శ్రీ పరమానంద స్వామి ఆశీస్సులతో దేవదుర్గలో బంగారు నిక్షేపాలు లభించాలని, స్థానికులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కలగాలని ఆయన ఆకాంక్షించారు.

* ఖనిజ నమూనాల పరిశీలన

లింగదహళ్లి గ్రామానికి చేరుకున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు కర్ణాటక మాజీ మంత్రి బోసురాజు తనయుడు, కాంగ్రెస్ నాయకుడు రవి బోసురాజు, స్థానిక సర్పంచ్ ఎల్లమ్మ తదితరులు ఘన స్వాగతం పలికారు. అనంతరం దేవదుర్గ బంగారు ఖనిజ బ్లాక్ వ్యూ పాయింట్ నుంచి ఖనిజ అన్వేషణ చేపట్టనున్న ప్రాంతాలను ఆయన పరిశీలించారు.

సింగరేణి అధికారులు సేకరించిన వివిధ రకాల ఖనిజ నమూనాలతో ఏర్పాటు చేసిన ప్రదర్శనను భట్టి విక్రమార్క తిలకించారు. బంగారం, రాగి అన్వేషణ, వెలికితీతకు సంబంధించిన ప్రక్రియలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం సింగరేణి అధికారులు, కర్ణాటక రాష్ట్ర అధికారులతో సమీక్ష నిర్వహించి ఖనిజ అన్వేషణపై దిశానిర్దేశం చేశారు. పర్యటన ముగింపులో లింగదహళ్లిలోని చారిత్రక శ్రీ పరమానంద శివాలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో సింగరేణి సంస్థ చైర్మన్, ఎండీ డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి, డైరెక్టర్ సీకే వెంకటేశ్వర్లు, జీఎం పంకజ్ కులశ్రేష్ఠ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల ప్రజాప్రతినిధులు, సింగరేణి ఉన్నతాధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular