Wednesday, July 15, 2026

Buy now

# దేవాదుల ప్రాజెక్టు పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తాం: ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

ప్రజానవ బ్యూరో, ములుగు:దేవాదుల ప్రాజెక్టు పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి, ఆయకట్టు రైతులకు పూర్తిస్థాయిలో సాగునీరు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రాజెక్టుకు నిధుల కొరత ఉండదని, 22 రిజర్వాయర్లను పూర్తిస్థాయిలో నింపడంతో పాటు దేవాదుల పంపింగ్ వ్యవస్థను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు.

ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం సమక్క సాగర్ ప్రాజెక్టు వద్దకు హెలికాప్టర్‌లో చేరుకున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, జిల్లా ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్, ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి లెనిన్ వస్సల్ టోప్పో, డీఎఫ్‌వో వికాస్ మినాలు ఘన స్వాగతం పలికారు.

అనంతరం మంత్రులు తుపాకులగూడెం సమ్మక్క-సారలమ్మ బ్యారేజీ వద్ద గోదావరి నది నీటి ప్రవాహం, నీటి నిల్వ పరిస్థితులను పరిశీలించారు. అలాగే గుట్టల గంగారం జె. చొక్కారావు దేవాదుల ప్రాజెక్టు వాటర్ పాయింట్‌ను సందర్శించి, మోటార్ల పనితీరు, ఎత్తిపోతల సామర్థ్యం తదితర అంశాలను పరిశీలించారు.

తదుపరి నిర్వహించిన సమీక్ష సమావేశంలో దేవాదుల ప్రాజెక్టు పెండింగ్ పనులు, భూసేకరణ, ఎత్తిపోతల సామర్థ్యం, సాగు, తాగునీటి అవసరాలు, మోటార్ల పనితీరుపై ఇంజనీరింగ్ అధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ ప్రాజెక్టు 38.16 టీఎంసీల సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో వినియోగించేందుకు చర్యలు చేపడతామని తెలిపారు.

భూసేకరణ ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడంతో పాటు ప్రాజెక్టు పనుల్లో ఉన్న అన్ని అడ్డంకులను వెంటనే తొలగిస్తామని చెప్పారు. పెండింగ్ బిల్లులను ఇప్పటికే విడుదల చేశామని, సాగునీరు, తాగునీటి అవసరాలే ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని స్పష్టం చేశారు. ఎల్‌నినో పరిస్థితులను ముందుగానే దృష్టిలో ఉంచుకుని కార్యాచరణ అమలు చేస్తున్నామని, గోదావరి జలాలతో రైతాంగానికి పూర్తి భరోసా కల్పిస్తామని పేర్కొన్నారు.

దేవాదుల ఆయకట్టుకు పూర్తి స్థాయిలో సాగునీరు అందించి రైతులకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.

Related Articles

spot_img

Most Popular