ఈ రెండున్నరేళ్ల కాలంలోనే 66,038 రైతు కుటుంబాలకు 3301.90 కోట్ల రైతుబీమా చెల్లింపు
– ఎల్‌ఐసీకి చెల్లించాల్సిన మొత్తం ప్రీమియంను చెల్లించాం: మంత్రి
రైతు మరణించిన సందర్భంలో వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే రైతు బీమా పథకాన్ని ప్రభుత్వం అత్యంత బాధ్యతతో అమలు చేస్తోందన్నారు. ఎల్‌ఐసీకి చెల్లించాల్సిన మొత్తం వార్షిక ప్రీమియాన్ని ప్రభుత్వం ఇప్పటికే చెల్లించిందన్నారు.
రైతు బీమా పథకాన్ని నిలిపివేసినట్లు ప్రచారం పూర్తిగా అసత్యమని మంత్రి తుమ్మల అన్నారు.
రైతు సంక్షేమం విషయంలో ప్రభుత్వం ఎలాంటి రాజీ పడదని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతులకు ఉపయోగపడే ఏ ఒక్క పథకాన్ని నిలిపివేసిన దాఖలాలు లేవని, పథకాలను నిలిపివేసి రైతులను ఇబ్బందులకు గురిచేసిన చరిత్ర గత ప్రభుత్వానిదే అని దుయ్యబట్టారు.
గత ప్రభుత్వం రైతులకు ఉపయోగపడే వ్యవసాయ యాంత్రీకరణ, సాయిల్ హెల్త్ టెస్ట్, సబ్సిడీపై విత్తనాలు వంటి పథకాలను నిలిపివేయడమే కాకుండా స్టేట్ వాటాను విడుదల చేయకుండా కేంద్ర ప్రాయోజిత పథకాలను సైతం రైతులకు దూరం చేసిందని విమర్శించారు. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే గత ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ఎలాంటి బేషజాలకు పోకుండా అమలు చేయడమే కాకుండా.. గత ప్రభుత్వం ఆపేసిన పథకాలను పునరుద్ధరిస్తూ రైతులకు అండగా నిలుస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదే అని పేర్కొన్నారు.
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 66,038 మంది రైతుల కుటుంబాలు రైతు బీమా పథకం ద్వారా లబ్ధి పొందాయని మంత్రి తెలిపారు. ఆయా కుటుంబాల నామినీల ఖాతాల్లో మొత్తం రూ. 3301.90 కోట్లు జమ చేసినట్లు వెల్లడించారు. 2023 డిసెంబర్ నుంచి ఆ ఏడాది ముగిసే వరకు 20,090 కుటుంబాలకు రూ.1,004.50 కోట్లు, 2024 సంవత్సరంలో 25,861 కుటుంబాలకు రూ.1,293.05 కోట్లు బీమా సాయంగా అందించినట్లు వివరించారు.
2025-26 సంవత్సరానికి రాష్ట్రంలో 42.16 లక్షల మంది రైతులు రైతు బీమా పథకంలో నమోదు చేసుకున్నారని, వీరందరికీ వర్తించేలా ఎల్‌ఐసీకి చెల్లించాల్సిన మొత్తం వార్షిక ప్రీమియం రూ.1,359.56 కోట్లను ప్రభుత్వం పూర్తిగా చెల్లించిందన్నారు. దీంతో 20,087 కుటుంబాలకు రూ.1004.35 కోట్లు బీమా సహాయంగా అంది, మరణించిన రైతు కుంటుబాలకు ఆర్ధిక చేయూత అందించడం జరిగిందని అన్నారు.
రైతుల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ప్రభుత్వంపై బురదచల్లే ప్రయత్నాలు మానుకోవాలని మంత్రి హితవు పలికారు. రైతు మరణంతో దుఃఖంలో ఉన్న కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించి వారిని ఆర్థికంగా నిలదొక్క కొనే విధంగా రైతు బీమా పథకాన్ని ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తోందని, రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి స్పష్టం చేశారు.

