Wednesday, July 15, 2026

Buy now

# ఫెడరల్ స్పిరిట్‌తో కేంద్రంతో ముందుకు.. రాష్ట్ర ప్రయోజనాల్లో రాజీ లేదు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ప్రజానవ బ్యూరో, హైదరాబాద్: తెలంగాణ ప్రజా ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలే ఏకైక లక్ష్యంగా కేంద్రంతో ఫెడరల్ స్పిరిట్‌తో ముందుకు సాగుతోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులు, వాటాలను సాధించేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తోందని, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎలాంటి రాజీ ఉండదని ఆయన అన్నారు.

సోమవారం మహాత్మా జ్యోతీరావు ఫూలే ప్రజాభవన్‌లో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డితో కలిసి నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర పార్లమెంట్ సభ్యుల సమావేశంలో భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఎంపీలు అందించిన ప్రతి సూచనను ప్లానింగ్ శాఖ అధికారులు నమోదు చేశారని, వాటిని అమలు చేసేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై కేంద్రానికి వివిధ శాఖల కార్యదర్శులు, మంత్రులు, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పంపే అన్ని లేఖల ప్రతులను తప్పనిసరిగా తెలంగాణ భవన్ స్పెషల్ సెక్రటరీకి పంపాలని ఆయన ఆదేశించారు. గతంలో పంపిన లేఖలు, పెండింగ్ అంశాలు, భవిష్యత్ ప్రతిపాదనలను శాఖల వారీగా క్రోడీకరించి సమగ్ర డ్రాఫ్ట్ రూపొందించి పార్లమెంట్ సమావేశాల సమయంలో ఎంపీలకు అందజేయాలని సూచించారు.

పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఎంపీలకు అవసరమైన సమాచారం, గణాంకాలను అందించేందుకు తెలంగాణ భవన్‌లో ప్లానింగ్ శాఖ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తామని భట్టి ప్రకటించారు. క్వశ్చన్ అవర్‌లో అడిగే సప్లిమెంటరీ ప్రశ్నలకు అవసరమైన సమాచారాన్ని కూడా ఈ బృందం సిద్ధం చేస్తుందని తెలిపారు.

కేంద్రం, రాష్ట్రంలో వేర్వేరు రాజకీయ పార్టీల ప్రభుత్వాలు ఉన్నప్పటికీ ప్రజాస్వామ్య విలువలు, ఫెడరల్ స్పిరిట్‌ను బలంగా విశ్వసిస్తున్నామని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ప్రతి సందర్భంలో రాజకీయ పార్టీ తరఫున కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫునే కేంద్రాన్ని కలుస్తున్నామని, ప్రజా ప్రయోజనాల సాధనే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.

భవిష్యత్‌లో పార్లమెంట్ సమావేశాలకు ముందే ఎంపీలతో సమన్వయ సమావేశాలు నిర్వహిస్తామని, అందరూ కలిసి కేంద్ర మంత్రులను డెలిగేషన్‌గా కలిస్తే రాష్ట్రానికి మెరుగైన ఫలితాలు సాధించవచ్చని అన్నారు. పార్లమెంట్ సమావేశాల సమయంలో ముఖ్యమంత్రి లేదా తాను ఢిల్లీలో ఎంపీలతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు.

గోదావరి పరివాహక ప్రాంతంలోని బొగ్గు బ్లాకులను వేలం లేకుండా సింగరేణికి కేటాయించాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ఎంపీలను కోరారు. గతంలో ప్రైవేటు సంస్థలకు కేటాయించిన సత్తుపల్లి, కోయగూడెం-3 బొగ్గు బ్లాకులను తిరిగి సింగరేణికి అప్పగించాలని డిమాండ్ చేశారు.

హైదరాబాద్‌కు సెమీకండక్టర్ ప్రాజెక్టు రావడం రాష్ట్ర అభివృద్ధికి గేమ్‌చేంజర్‌గా మారుతుందని పేర్కొన్న భట్టి, సాగునీటి ప్రాజెక్టుల అనుమతులు, ఐఐఎం, ఐఐటీలు, రైల్వే నెట్‌వర్క్ విస్తరణ వంటి అంశాల్లో కూడా ఎంపీలు కలిసి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు.

జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత రాష్ట్రాల పన్ను ఆదాయం కేంద్ర పూల్‌కు వెళ్తోందని, రాష్ట్రానికి రావాల్సిన వాటాను సాధించేందుకు కేంద్రాన్ని ఎన్నిసార్లు కలవడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

Related Articles

spot_img

Most Popular