* రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
* భూ భారతి విజయవంతమైన అమలుకు భూ రీ-సర్వేనే కీలకం
* మార్చి-2027 నాటికి మూడు విడతల్లో రీ-సర్వే పూర్తి చేయాలి
* రీ-సర్వేలో పనిచేసే లైసెన్స్ సర్వేయర్లకు ఎకరానికి రూ.60 చెల్లింపు
* సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలి
* ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, 2బీహెచ్‌కే ఇళ్ల పంపిణీని వేగవంతం చేయాలి
* ఆగస్టు 15 నాటికి ప్రతి విద్యార్థికి కనీసం ఒక జత యూనిఫాం అందించాలి
* భూ రీ-సర్వే, సాదాబైనామా దరఖాస్తులు, ఇందిరమ్మ ఇండ్ల పురోగతిపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రెవెన్యూ రాష్ట్ర మంత్రి
పెద్దపల్లి : భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు భూ భారతి చట్టం సమర్థవంతంగా అమలు కావాలంటే రాష్ట్రవ్యాప్తంగా భూ రీ-సర్వేను అత్యంత ప్రాధాన్యతతో చేపట్టాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
భూ రీ-సర్వే, భూ భారతి అమలు, సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారం, ఇందిరమ్మ ఇండ్లు, 2 బీహెచ్ కే ఇళ్ల పంపిణీ, విద్యార్థుల యూనిఫాంల పంపిణీ తదితర అంశాలపై రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శనివారం ఖమ్మం జిల్లా సమీకృత కలెక్టరేట్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
హైదరాబాద్ నుంచి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డి.ఎస్. లోకేష్ కుమార్ పాల్గొన్నారు. పెద్దపల్లి సమీకృత జిల్లా కలెక్టరేట్ (ఐడీఓసీ) నుంచి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ధరణిని రద్దు చేసి భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చామని, రైతుల భూములకు పూర్తి భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
భూ భారతి అమల్లోకి వచ్చి 15 నెలలు పూర్తయినా ప్రజల అంచనాలకు పూర్తిస్థాయిలో చేరలేకపోయామని తెలిపారు. ధరణి కాలంలో పెండింగ్‌లో ఉన్న 9.6 లక్షల సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారం కోసం భూ భారతిలో అవకాశం కల్పించి, హైకోర్టు సమస్యలను పరిష్కరించినప్పటికీ అధిక సంఖ్యలో దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నాయనే అభిప్రాయం ప్రజల్లో ఉందన్నారు. తిరస్కరణలకు గల కారణాలను గుర్తించి నిబంధనల మేరకు త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
భూ భారతి చట్టం సమర్థవంతంగా అమలు కావాలంటే భూ రీ-సర్వే తప్పనిసరి అని మేధావులు సూచించడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఇందుకోసం శిక్షణ పొందిన 5,700 మంది లైసెన్స్ సర్వేయర్ల సేవలను వినియోగించుకోవాలని, రెగ్యులర్ సర్వేయర్లు, లైసెన్స్ సర్వేయర్లు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. లైసెన్స్ సర్వేయర్లకు ఉద్యోగం లేదా రెగ్యులరైజేషన్ హామీ ఇవ్వలేదని స్పష్టం చేశారు.
పైలట్ ప్రాజెక్టుగా నక్షాలు లేని 413 ప్రాంతాల్లోని ఐదు గ్రామాల్లో నిర్వహించిన రీ-సర్వేతో 95 శాతం వరకు భూ సమస్యలు పరిష్కారమయ్యాయని తెలిపారు. శుక్రవారం ముఖ్యమంత్రి ఆయా గ్రామాల రైతులకు కొత్త పట్టాదారు పాస్‌బుక్‌లు పంపిణీ చేశారని గుర్తు చేశారు. తొలి విడతలో ప్రతి జిల్లాలో 70 గ్రామాలను ఎంపిక చేసి రీ-సర్వే చేపడుతున్నట్లు తెలిపారు.
రీ-సర్వేకు అవసరమైన అత్యుత్తమ నాణ్యత గల పరికరాలను జిల్లా స్థాయిలో కొనుగోలు చేయాలని, కొనుగోలు ముందు రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. కలెక్టర్లు భూ రీ-సర్వేను అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకుని అవసరమైన సిబ్బంది, పరికరాలు, మౌలిక వసతులు సమకూర్చాలని ఆదేశించారు. ప్రతి నెల వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పురోగతిని సమీక్షిస్తామని, మార్చి-2027 నాటికి మూడు విడతల్లో రీ-సర్వే పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
రీ-సర్వేలో పనిచేసే లైసెన్స్ సర్వేయర్లకు ఎకరానికి రూ.50తో పాటు రవాణా, ఇతర ఖర్చుల కోసం మరో రూ.10 చెల్లించి మొత్తం రూ.60 అందజేస్తామని తెలిపారు. చెల్లింపులు వెంటనే జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. జూలై 28లోపు విధుల్లో చేరని లైసెన్స్ సర్వేయర్ల లైసెన్సులు రద్దు చేయాలని ఆదేశించారు. వారికి బీమా, సామాజిక భద్రత కల్పించే చర్యలు కూడా తీసుకుంటామని వెల్లడించారు.
ఒక సర్వే నంబరులో కొంత భూమి మాత్రమే ప్రభుత్వ అవసరాలకు సేకరించినప్పటికీ మొత్తం భూమిని నిషేధిత జాబితాలో ఉంచడం వంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. సాదాబైనామా దరఖాస్తులను నిబంధనల ప్రకారం పరిష్కరించి నోటీసులు త్వరితగతిన జారీ చేయాలని సూచించారు.
పాలేరు నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజాదర్బార్‌లో వచ్చిన 6,500 రెవెన్యూ సమస్యల్లో 98 శాతం సమస్యలకు భూ రీ-సర్వేతో శాశ్వత పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు.
మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని, పెండింగ్‌లో ఉన్న 2 బీహెచ్ కే ఇళ్లను ప్రస్తుత స్థితిలోనే లబ్ధిదారులకు అందజేసి, మిగిలిన పనులకు అనంతరం నిధులు విడుదల చేయాలని ఆదేశించారు. నిధులు విడుదలైనా పనులు చేపట్టని చోట్ల బాధ్యులైన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని స్పష్టం చేశారు.
రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికను వెంటనే పూర్తి చేసి గుడిసెల్లో నివసించే కుటుంబాలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని, మొదటి విడతలో మంజూరు కాని అర్హుల ఇళ్లను కూడా రెండో విడతలో చేర్చి మంజూరు చేయాలని సూచించారు. ఇసుక, కంకర సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డి.ఎస్. లోకేష్ కుమార్ మాట్లాడుతూ తొలి విడతలో ఎంపిక చేసిన 70 గ్రామాల్లో భూ రీ-సర్వేను నవంబర్‌లోపు పూర్తి చేయాలని, రెండో విడతలో మరో 70 గ్రామాల్లో మార్చి-2027లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. రీ-సర్వే పూర్తయితే సాదాబైనామా దరఖాస్తుల తిరస్కరణలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుందని తెలిపారు.
తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వి.పి. గౌతమ్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో సుమారు 41 వేల గుడిసెలను గుర్తించామని, అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగంగా పూర్తి చేసి ఆగస్టు నాటికి రెండు లక్షల ఇళ్ల లక్ష్యాన్ని చేరుకోవాలని, పెండింగ్‌లో ఉన్న 2 బీహెచ్ కే ఇళ్లను వెంటనే లబ్ధిదారులకు అప్పగించాలని సూచించారు.
సెర్ప్ సీఈవో దివ్య మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల విద్యార్థుల యూనిఫాంలన్నీ స్వయం సహాయక సంఘాల మహిళా టైలర్ల ద్వారానే కుట్టిస్తున్నామని తెలిపారు. టెండర్ ఆలస్యంతో వస్త్రం ఆలస్యంగా వచ్చినప్పటికీ జూలై 15లోపు రెసిడెన్షియల్ బాలికలకు, జూలై 30లోపు బాలురకు యూనిఫాంలు అందించాలని సూచించారు.
ఆగస్టు 15 నాటికి రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి కనీసం ఒక జత యూనిఫాం అందేలా కలెక్టర్లు, డీఆర్‌డీఏ, గురుకులాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 26 వేల మంది శిక్షణ పొందిన స్వయం సహాయక సంఘాల టైలర్లు భాగస్వాములయ్యారని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా రెవెన్యూ అధికారి రాజేశ్వరి, రెవెన్యూ డివిజనల్ అధికారి బి. గంగయ్య, సురేష్, ఏ.డి.సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ సహాయ సంచాలకులు తదితరులు పాల్గొన్నారు.

