Wednesday, July 15, 2026

Buy now

యునాని వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలి: మంత్రి దామోదర్ రాజనర్సింహ

ప్రజానవ బ్యూరో, హైదరాబాద్:యునాని వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేసి, నాణ్యమైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. సోమవారం సచివాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయుష్ శాఖ పనితీరు, నిజామియా టిబ్బీ హాస్పిటల్‌లో అందుతున్న వైద్య సేవలు, మౌలిక వసతులు, నిర్మాణ పనులు, భవిష్యత్ కార్యాచరణపై ఆయన సమగ్రంగా సమీక్షించారు.

హైదరాబాద్‌లోని ప్రభుత్వ నిజామియా టిబ్బీ కాలేజీ, నిజామియా జనరల్ హాస్పిటల్ రాష్ట్రంలో యునాని వైద్య సేవలకు ప్రతిష్ఠాత్మక సంస్థలని మంత్రి పేర్కొన్నారు. వాటి అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఓపీ బ్లాక్, ఫార్మసీ భవనం పనులను వేగవంతం చేసి వచ్చే జనవరి నాటికి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని టీజీఎంఎస్‌ఐడీసీ చీఫ్ ఇంజనీర్‌ను ఆదేశించారు.

హాస్పిటల్‌లో డాక్టర్లు, టీచింగ్ ఫ్యాకల్టీ, ఇతర సిబ్బంది ఖాళీల కారణంగా వైద్య సేవలు, విద్యా కార్యక్రమాలకు అంతరాయం కలగకుండా వెంటనే భర్తీ ప్రక్రియ చేపట్టేందుకు అవసరమైన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపాలని ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి సూచించారు. యునాని డిస్పెన్సరీలు, ఆస్పత్రుల్లో అవసరమైన మందులు, పరికరాలు, మౌలిక సదుపాయాలు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా ఆయుష్ డైరెక్టర్ శ్రీకాంత్ బాబు మాట్లాడుతూ, గత ఏడాది ప్రభుత్వం 138 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయడంతో డాక్టర్ల కొరత తీరిందన్నారు. నిజామియా టిబ్బీ కాలేజీ, నిజామియా జనరల్ హాస్పిటల్ వారసత్వ భవనాల పునరుద్ధరణతో పాటు కొత్త భవనాల నిర్మాణానికి రూ.52.50 కోట్లు మంజూరు చేసి పనులు ప్రారంభించినట్లు తెలిపారు. అవసరమైన యునాని మందుల కొనుగోలు, పంపిణీ కూడా కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు.

శాఖ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై కూడా మంత్రి ఆరా తీశారు. రాష్ట్ర స్థాయి యునాని ఔషధ తయారీ యూనిట్ ఏర్పాటు ప్రతిపాదనను వేగవంతం చేయాలని సూచించారు. అలాగే మౌలాలిలోని ప్రభుత్వ యునాని డిస్పెన్సరీ భవనానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించి, అక్కడ వైద్య సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో చార్మినార్ ఎమ్మెల్యే మీర్ జుల్ఫికర్ అలీ, ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ క్రిస్టినా జడ్ చొంగ్తు, ఆయుష్ డైరెక్టర్ శ్రీకాంత్ బాబు, నిజామియా టిబ్బీ హాస్పిటల్ సూపరింటెండెంట్‌తో పాటు శాఖకు చెందిన ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular