Wednesday, July 15, 2026

Buy now

రాష్ట్రవ్యాప్తంగా 96.81 లక్షల మంది చిన్నారులకు ఆల్బండజోల్ మాత్రల పంపిణీ ప్రారంభం

ప్రజానవ ,హైదరాబాద్: పిల్లల్లో నులిపురుగుల (నట్టలు) సమస్యను నివారించేందుకు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఆల్బండజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సోమవారం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు స్వయంగా ఆల్బండజోల్ మాత్రలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలోని 1 నుంచి 19 సంవత్సరాల మధ్య వయస్సు గల ప్రతి చిన్నారికి ఆల్బండజోల్ మాత్ర తప్పనిసరిగా వేయించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. పిల్లల్లో నులిపురుగుల వల్ల రక్తహీనత, పోషకాహార లోపం, ఎదుగుదల మందగించడం, బరువు తగ్గడం వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో పాటు చదువుపై ఏకాగ్రత కూడా తగ్గే ప్రమాదం ఉంటుందని తెలిపారు. నులిపురుగులు బయటకు కనిపించకపోయినా పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని, అందుకే ప్రతి చిన్నారికి ఆల్బండజోల్ మాత్ర వేయడం అవసరమని పేర్కొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, తల్లిదండ్రులు పూర్తి సహకారం అందించాలని మంత్రి కోరారు. ఆల్బండజోల్ మాత్రల వల్ల నులిపురుగుల సమస్య తొలగిపోవడంతో పాటు తిన్న ఆహారంలోని పోషకాలు శరీరానికి సమర్థవంతంగా అందుతాయని, రోగనిరోధక శక్తి పెరుగుతుందని, పిల్లల్లో చదువుపై ఏకాగ్రత, నేర్చుకునే సామర్థ్యం మెరుగుపడుతుందని వివరించారు.

జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమం మాత్రలు పంపిణీతోనే ముగిసిపోదని మంత్రి తెలిపారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత, చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవడం, పరిశుభ్రమైన తాగునీరు వినియోగించడం, పండ్లు, కూరగాయలను శుభ్రంగా కడిగి తినడం వంటి మంచి అలవాట్లపై పిల్లలు, తల్లిదండ్రుల్లో విస్తృత అవగాహన కల్పించాలని ఆరోగ్యశాఖ అధికారులకు సూచించారు.

విద్యాశాఖ, మహిళా-శిశు సంక్షేమ శాఖల సమన్వయంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం కింద రాష్ట్రవ్యాప్తంగా 1 నుంచి 19 సంవత్సరాల మధ్య వయస్సున్న **96,81,855 మంది** చిన్నారులు, విద్యార్థులకు ఆల్బండజోల్ మాత్రలు అందజేయనున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఈరోజు ఏ కారణంతోనైనా మాత్ర తీసుకోలేకపోయిన పిల్లలకు జూలై 20న నిర్వహించే మాప్-అప్ కార్యక్రమంలో తప్పనిసరిగా ఆల్బండజోల్ మాత్ర వేయనున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఆరోగ్యశాఖ ప్రధాన కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జడ్ చొంగ్తు, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ, హైదరాబాద్ డీఎంహెచ్‌వో డాక్టర్ పి. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular