* 55 ఏళ్ల పాత భవనంలోనే విద్యార్థుల అవస్థలు
* నూతన భవనం నిర్మించాలని కలెక్టర్‌కు ఎమ్మార్పీఎస్, ఎంఎస్‌ఎఫ్ వినతి
ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో: ఖిల్లా ఘణపురం మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతి గృహం సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. దాదాపు 55 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ పాత భవనం ప్రస్తుతం పూర్తిగా శిథిలావస్థకు చేరింది. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనల మధ్య కాలం వెల్లదీస్తున్నారు. ఈ నేపథ్యంలో, హాస్టల్‌కు తక్షణమే నూతన భవనాన్ని నిర్మించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్, మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా కమిటీ ప్రతినిధులు సోమవారం వనపర్తి జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.
ఎనిమిదేళ్లుగా అరణ్య రోదనే..
హాస్టల్‌కు నూతన భవనాన్ని మంజూరు చేయాలని గత ఎనిమిదేళ్లుగా వార్డెన్ ద్వారా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తున్నప్పటికీ ఫలితం లేకుండా పోయిందని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. కనీస మౌలిక వసతులైన మరుగుదొడ్లు, తాగునీరు, విద్యుత్ సౌకర్యం లేక విద్యార్థులు నరకయాతన అనుభవిస్తున్నారని మండిపడ్డారు.

