- కార్పొరేటర్ నుంచి కేంద్ర మంత్రి దాకా ఎదగడం బీజేపీలోనే సాధ్యం
- మోడీ, అమిత్ షాలకు ధన్యవాదాలు
- రాష్ట్రాభివృద్ధికి, కరీంనగర్ పార్లమెంట్‌కు అధిక నిధులు తెస్తా
- కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
- కేంద్ర మంత్రి హోదాలో తొలిసారి కరీంనగర్‌కి
- బుల్డోజర్లతో పూల వర్షం కురిపించిన నాయకులు, అభిమానులు
‘కార్యకర్తలారా… ఆనాడు నాతో కలిసి మీరు కేసీఆర్ మూర్ఖపు పాలనపై పోరాడి లాఠీదెబ్బలు తిన్నరు. కేసులు ఎదుర్కొన్నారు. జైళ్లకు వెళ్లారు. రక్తం చిందించారు. ప్రజా సంగ్రామ యాత్రలో నాతో కలిసి అడుగులో అడుగు వేసుకుంటూ కష్టాలను లెక్క చేయకుండా 155 రోజుల పాటు 1600 కిలో మీటర్లకుపైగా నడిచారు. పార్టీ బలోపేతం కోసం ఎంతో కష్టపడ్డారు. అందుకే ఈరోజు నాకీ పదవి వచ్చింది. ఈ పదవి మీరు పెట్టిన భిక్షే. ప్రజలకు, కార్యకర్తలకే ఈ పదవిని అంకితమిస్తున్నా.’
కరీంనగర్ బ్యూరో, ప్రజానావ: తనకు కేంద్ర మంత్రి పదవి దక్కడం కరీంనగర్ ప్రజలతో పాటు కార్యకర్తలు పెట్టిన భిక్షేనని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు.
కేంద్ర మంత్రి హోదాలో బుధవారం తొలిసారి కరీంనగర్‌కు వచ్చిన బండి సంజయ్ కు అడుగడుగునా అపూర్వ స్వాగతం లభించింది.
ఈ సందర్భంగా కరీంనగర్ లో బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. ‘కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి కరీంనగర్ కు వచ్చాను.
ఈ సందర్భంగా కరీంనగర్ కు, తెలంగాణ రాష్ట్రానికి సెల్యూట్ చేస్తున్నా. ఈ పదవి వచ్చిందంటే కరీంనగర్ ప్రజలు పెట్టిన భిక్షే. ప్రజలు ఓట్లేసి భారీ మెజారిటీతో గెలిపించడంవల్లే ఈరోజు మంత్రిగా మీ ముందున్నా.
కార్పొరేటర్ నుంచి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఎదిగానంటే ఇది కేవలం బీజేపీవల్లే సాధ్యమైంది. మహాశక్తి అమ్మవారి ఆశీస్సులతోనే సాధ్యమైంది.
ముఖ్యంగా నేను రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీ కార్యకర్తలపై ప్రయోగించిన లాఠీదెబ్బలకు నాకు గుర్తింపు వచ్చింది.
బీఆర్ఎస్ మూర్ఖత్వ పాలనను నిరసించిన కార్యకర్తలను జైలుకు పంపడం ద్వారా నాకు గుర్తింపు వచ్చింది. ప్రజా సమస్యలపై పోరాడుతున్న బీజేపీ కార్యకర్తలపై రౌడీషీట్లు తెరిచినందున నాకు గుర్తింపు వచ్చింది.
ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో 155 రోజులు పాదయాత్ర చేసి 1600 కి.మీలు తిరిగితే.. నా అడుగులో అడుగు వేసి కార్యకర్తలు నడిచినందునే ఈ పదవి వచ్చింది.
అందుకే ఈ పదవి కార్యకర్తలకే అంకితం. కార్యకర్తలు నా పక్షాన ఉండకుంటే.. లాఠీదెబ్బలు తినకుంటే, జైలుకు వెళ్లకుంటే నాకు ఈ గుర్తింపు వచ్చేది కాదు.. కేంద్ర మంత్రి పదవిని అధికారం కోసమో, పదవులను అనుభవించడానికో కాకుండా తెలంగాణ అభివృద్ధే లక్ష్యంగా పనిచేయడం కోసం ఉపయోగిస్తా.
రాజకీయాలకు అతీతంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఈ పదవిని ఉపయోగిస్తా’ అన్నారు. ఎన్నికల వరకే రాజకీయాలని, ఎన్నికల తర్వాత పూర్తిగా తెలంగాణతో పాటు కరీంనగర్ అభివృద్ధి కోసమే పనిచేస్తానన్నారు.
గురువారం కిషన్ రెడ్డి రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో ఆయనతో కలిసి బేగంపేట విమానాశ్రయం నుంచి పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్తున్నానని ‘సెల్యూట్ తెలంగాణ’ పేరుతో నిర్వహించే
ఈ కార్యక్రమానికి తెలంగాణలోని ప్రతి ఒక్కరూ తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బండి సంజయ్ కోరారు.
కరీంనగర్ గడ్డపై సాష్టాంగ నమస్కారం
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హోదాలో తొలిసారి కరీంనగర్ చేరుకున్న బండి సంజయ్ భావోద్వేగం చెందాడు. కరీంనగర్ గడ్డపై ప్రణమిల్లి సాష్టాంగ నమస్కారం చేశారు. ఈ సందర్భంగా తనను ఎంపీగా గెలిపించిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు.
అంతకుముందు మహాశక్తి అమ్మవారికి పూజలు చేసి ఇంటికెళ్లిన బండి సంజయ్‌కు సతీమణి హారతి ఇవ్వగా, వదినలు వీరతిలకం దిద్దగా ఇంట్లో అడుగు పెట్టారు. ఆ వెంటనే అమ్మ ఆశీస్సులు అందుకున్నారు.
అంజన్న ఆశీస్సులతో.. రాజన్న దీవెనలతో..
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బాధ్యతలు తీసుకున్న తరువాత తొలిసారి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో అడుగుపెట్టిన బండి సంజయ్ కుమార్ కోహెడ నియోజకవర్గంలోకి
ప్రవేశించి కరీంనగర్, చొప్పదండి, వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేశారు. ఉదయం సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని శనిగరం వద్ద నుండి ప్రారంభమైన పర్యటన కరీంనగర్, చొప్పదండి, వేములవాడ, సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొనసాగింది.
మధ్యాహ్నం కరీంనగర్ మహాశక్తి ఆలయంలో పూజలు నిర్వహించిన బండి సంజయ్ అక్కడి నుండి కొండగట్టు అంజన్న ఆలయం వద్దకు చేరుకున్నారు.
పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ఆలయ అధికారుల స్వాగతం, వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య అంజన్న ఆలయంలోకి ప్రవేశించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి అంజన్న ఆశీస్సులు అందుకున్నారు.
అక్కడి నుంచి వేములవాడకు విచ్చేసిన బండి సంజయ్ కు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. పూజారుల వేద మంత్రోచ్చారణలతో ఆలయంలోకి తోడ్కొని వెళ్లగా కోడె మొక్కు చెల్లించారు.
అనంతరం శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడంతోపాటు అర్చకుల ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన బండి సంజయ్ అక్కడి నుండి నేరుగా సిరిసిల్ల పట్టణంలోని మార్కండేయ ఆలయంలోకి ప్రవేశించి పూజలు నిర్వహించారు.
అంతకుముందు సిరిసిల్లలో బీజేపీ కార్యకర్తలు, నాయకులు భారీ ఎత్తున ఎదురేగి బండి సంజయ్ కు ఘన స్వాగతం పలికారు.
మరోవైపు గురువారం ఉదయం కరీంనగర్ లో పర్యటించనున్న బండి సంజయ్ పాతవాడలోని శివాలయం, కమాన్ వద్దనున్న రామేశ్వరాలయంను దర్శించుకోనున్నారు. అనంతరం ఎంపీ కార్యాలయానికి విచ్చేసి సందర్శకులను కలుస్తారు.
మధ్యాహ్నం ఒంటి గంటకు తిరిగి హైదరాబాద్ బయలుదేరి వెళతారు. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డితో కలిసి బేగంపేట ఎయిర్ పోర్టు నుండి బీజేపీ రాష్ట్ర కార్యాలయం వరకు ‘సెల్యూట్ తెలంగాణ’ పేరుతో ర్యాలీ నిర్వహించనున్నారు.
అక్కడ కేంద్ర మంత్రులను, బీజేపీ ఎంపీలకు నిర్వహించే సన్మాన కార్యక్రమంలో పాల్గొని అక్కడి నుండి కిషన్ రెడ్డితో కలిసి నేరుగా పాతబస్తీ భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.