- అత్యధిక సిక్సర్లు బాదిన రెండో క్రికెటర్‌గా రికార్డు సృష్టించిన రో’హిట్’
- అత్యధిక సెంచరీల జాబితాలో మూడో స్థానంలో..
ఎట్టకేలకు టీమిండియా కెప్టెన్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ చాలారోజుల తర్వాత సెంచరీ సాధించాడు. కటక్ వేదికగా ఆదివారం ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో వన్డేలో తన కెరీర్‌లో 32వ సెంచరీని సాధించాడు.
ఈ క్రమంలో పలు రికార్డులను రోహిత్ శర్మ బద్దలుకొట్టాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఇప్పటివరకు 338 సిక్సర్లతో యూనివర్సల్ బాస్, వెస్టిండీస్ మాజీ ఆటగాడు క్రిస్‌గేల్‌ను అధిగమించాడు. క్రిస్‌గేల్ 301 మ్యాచుల్లో 331 సిక్సర్లు బాదాడు.
రోహిత్, క్రిస్‌గేల్ కంటే ముందు పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది 398 మ్యాచుల్లో 351 సిక్సర్లతో తొలిస్థానంలో కొనసాగుతున్నాడు. మరో 13 సిక్సర్లు కొడితే ఈ వన్డే ఫార్మాట్‌లో రోహిత్ తొలి స్థానంలో కొనసాగే అవకాశం ఉంది.
ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో మరో మ్యాచ్ మాత్రమే మిగిలి ఉండడంతో ఈ సిరీస్ ఇది సాధ్యమయ్యే పనికాదు. మరికొద్ది రోజుల్లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో ఈ అరుదైన ఘనతను రోహిత్ అందుకునే అవకాశం ఉంది.
ఇదిలాఉంటే టెస్టులు, టీ20, వన్డేలు మూడు ఫార్మాట్లలో కలిపి 631 సిక్సర్లతో హిట్‌మ్యాన్ తొలిస్థానంలో కొనసాగడం గమనార్హం. ఇక వన్డేల్లో విరాట్ కోహ్లీ (50), సచిన్ టెండూల్కర్ (49) తర్వాత రోహిత్ 32 సెంచరీలతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.