Wednesday, July 15, 2026

Buy now

గ్రీన్ గ్రోత్–ఏఐలో తెలంగాణ గ్లోబల్ లీడర్

“డేటా సెంటర్ల నిర్మాణంలో ప్రపంచానికి తెలంగాణే మార్గదర్శి”
ప్రపంచానికి రోల్ మోడల్‌గా తెలంగాణ ఏఐ విధానం,
డేటా సెంటర్లకే కాదు.. బాధ్యతాయుత ఏఐకి తెలంగాణ చిరునామా: గ్రీన్ గ్రోత్ ఎకనామిక్ సమ్మిట్ 2026లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.

హైదరాబాద్‌: హెచ్‌ఐసీసీలో ‘గ్రీన్ గ్రోత్ ఎకానమిక్ సమ్మిట్ – ది హైదరాబాద్ కలెక్టివ్’ కార్యక్రమాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పరిశ్రమలు & ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సంయుక్తంగా ప్రారంభించారు. ‘ది మెరీడియన్ కలెక్టివ్’ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరిగే ఈ సమ్మిట్‌కు వివిధ దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ..,
కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగంలో కేవలం పెట్టుబడులు ఆకర్షించడం మాత్రమే కాకుండా, పర్యావరణ పరిరక్షణ, సామాజిక న్యాయం, స్థానిక ఉపాధి అవకాశాలను కలిపి ప్రపంచానికి కొత్త దిక్సూచి చూపిస్తోంది తెలంగాణ. ఏఐని బాధ్యతాయుతంగా అభివృద్ధి చేసి హైదరాబాద్‌ను దానికి ‘కేరాఫ్ అడ్రస్’గా మార్చాలని స్పష్టం చేశారు.

“ఏఐ అంటే కేవలం క్లౌడ్ కంప్యూటింగ్, సర్వర్లు మాత్రమే కాదు. దీని వెనుక విద్యుత్, నీరు, భూమి, మానవ వనరులు ఉంటాయని మా ప్రభుత్వం గుర్తించింది. మేము ఏఐ వద్దని చెప్పడం లేదు… కానీ ఆ ఏఐ ఎలా ఉండాలో ప్రపంచానికి దిశానిర్దేశం చేస్తున్నాం” అని పేర్కొన్నారు.

పర్యావరణానికి హాని చేస్తూ ఏఐ సంస్థలను అనుమతించేవారిని తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహించదని స్పష్టం చేశారు. పెట్టుబడులు రావాల్సిందేనని, కానీ అవి స్వచ్ఛమైన ఇంధనంతో, రీసైకిల్ చేసిన నీటిని మాత్రమే వాడి, స్థానిక నైపుణ్యాలను పెంపొందించే విధంగా ఉండాలని నిబంధన విధించారు. ఇది కేవలం ఇంజనీరింగ్ మెరుగుదల కాదు, మన విలువలకు నిదర్శనమన్నారు.

ప్రపంచవ్యాప్తంగా కార్బన్ క్రెడిట్స్ గురించి చర్చ జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ‘పీపుల్స్ క్రెడిట్’ అనే కొత్త భావనను ప్రవేశపెట్టిందని డిప్యూటీ సీఎం వెల్లడించారు. ఏఐ పెట్టుబడులు డేటా సెంటర్లకు మాత్రమే పరిమితం కాకుండా, స్థానిక ఉపాధి, గ్రామీణ యువతకు నైపుణ్యాలు, సామాజిక అభివృద్ధికి కూడా దోహదపడాలని ప్రభుత్వం నిర్దేశించిందన్నారు.

వ్యవసాయానికి, సామాన్యులకు అవసరమైన నీటితో సాంకేతికత ఎప్పుడూ పోటీ పడకూడదని నొక్కి చెప్పారు. ఏఐ సంస్థలు భాషా అడ్డంకులు లేకుండా సామాన్య ప్రజలకు, ముఖ్యంగా గ్రామీణ యువతకు అందుబాటులో ఉండాలన్నారు.

ప్రజల సంక్షేమం, పర్యావరణ పరిరక్షణ, పారదర్శక పాలన, పెట్టుబడులకు అనుకూల వాతావరణం అనే నాలుగు సూత్రాల ఆధారంగా తెలంగాణ ముందుకు సాగుతోందన్నారు. భవిష్యత్తులో కేవలం ఏఐ మేధస్సు మాత్రమే కాదు, మానవీయ విలువలను కలిగిన సాంకేతిక వ్యవస్థలే ప్రపంచానికి మార్గదర్శకాలు అవుతాయని, ఆ దిశగా తెలంగాణ ఇప్పటికే తన ప్రయాణాన్ని ప్రారంభించిందని స్పష్టం చేశారు.

నెహ్రూ నుంచి మన్మోహన్ సింగ్ వరకు దేశం అనుసరించిన శాస్త్ర సాంకేతిక వృద్ధి మార్గాన్ని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం మరింత ముందుకు తీసుకెళ్తోందన్నారు. తెలంగాణ కేవలం డేటా సెంటర్ల కేంద్రం కాదు, ఏఐని బాధ్యతాయుతంగా ఎలా నిర్మించాలో ప్రపంచానికి నేర్పే ‘రోల్ మోడల్’గా నిలుస్తుందన్నారు.

Related Articles

spot_img

Most Popular