ప్రజానావ,పెద్దపల్లి,బ్యూరో : పెద్దపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగిన దొంగతనం కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఈ కేసులో కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఇద్దరు నిందితులు లతేష్, సందీప్ లు బాధితురాలి జ్యోతిష్యం పేరుతో పూజలు చేసి దోషం లేకుండా చేస్తామని నమ్మపలికి, ఆమెకు మంగళ్య దోషం ఉందని దాని నివారణ నిమిత్తం పూజ పేరుతో ఆమెను మాటల్లో పెట్టి, ఆమె దృష్టిని మరల్చి (రెండు తులాలు బంగారు పుస్తెల త్రాడు, రెండు గ్రాముల కమ్మలు) ఆభరణాలను అపహరించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజ్, విశ్వసనీయ సమాచారం ఆధారంగా పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి దొంగిలించిన సొత్తు, ఘటనలో ఉపయోగించిన సెల్ ఫోనులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను న్యాయస్థానం ముందు హాజరుపరచగా, కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. కేసుకు సంబంధించి మరిన్ని అంశాలపై దర్యాప్తు కొనసాగుతోందని పెద్దపల్లి టౌన్ పోలీస్ లు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలను పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అపరిచిత వ్యక్తులు మాటల్లో పెట్టి దృష్టి మరల్చే ప్రయత్నం చేసినప్పుడు వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్ 100కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

