ఉమ్మడి మహబూబ్‌నగర్ బ్యూరో: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా రోడ్ల నెట్‌వర్క్‌ను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ విధానంలో చేపట్టనున్న ప్రతిష్టాత్మక రహదారుల అభివృద్ధి పనులకు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి శంకుస్థాపనలు చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా ప్యాకేజ్-1లో భాగంగా రూ.573 కోట్ల వ్యయంతో చేపట్టే పనులను మక్తల్ నియోజకవర్గంలో ప్రారంభించారు. ఇందులో భాగంగా ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న రూ.237 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న మక్తల్–నారాయణపేట నాలుగు లైన్ల హ్యామ్ రోడ్డు పనులకు మంత్రులు శంకుస్థాపన చేసి, పైలాన్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ గత ప్రభుత్వం రహదారుల అభివృద్ధిని విస్మరించిందని, ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రవాణా కష్టాలు తీర్చేందుకు ఈ భారీ ప్రాజెక్టును మంజూరు చేసిందని తెలిపారు. అదేవిధంగా వనపర్తి జిల్లాలో రూ.359.09 కోట్ల వ్యయంతో చేపట్టనున్న 171.96 కి.మీ పొడవు గల హ్యామ్ రోడ్డు పనులకు, జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలంలో రూ.339.39 కోట్లతో చేపట్టనున్న గద్వాల- రాయచూర్ మహబూబ్‌నగర్-2 ప్యాకేజీ రహదారి పనులకు మంత్రులు భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమాలలో ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, వీర్లపల్లి శంకర్, తూడి మేఘారెడ్డి, జి. మధుసూదన్ రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, కలెక్టర్లు ప్రియాంక, ఆదర్శ్ సురభి, ఎస్పీలు డాక్టర్ వినీత్, సునీతారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డి తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

