**ప్రజానవ బ్యూరో, పెద్దపల్లి:పెద్దపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగిన అటెన్షన్ డైవర్షన్ దొంగతనం కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఈ కేసులో కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి దొంగిలించిన బంగారు ఆభరణాలతో పాటు నేరానికి ఉపయోగించిన సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
అరెస్టు చేసిన నిందితులు లతేశ్ మగ్గెకవల్ రంగన్న అలియాస్ లతేశ్ ఎం.ఆర్. (24), సుదీప్ మగ్గెకవల్ శేఖర్ (24)గా పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ కర్ణాటక రాష్ట్రంలోని హసన్ జిల్లా, అరకలగూడ్ మండలం, మగ్గెకవల్ శ్రీరాంపుర గ్రామానికి చెందినవారు.
పోలీసుల వివరాల ప్రకారం.. నిందితులు బాధితురాలిని జ్యోతిష్యం, ప్రత్యేక పూజల పేరుతో నమ్మించి, మాంగల్య దోషం తొలగిస్తామని విశ్వసింపజేశారు. అనంతరం పూజలు నిర్వహిస్తున్నట్లు నటిస్తూ ఆమె దృష్టి మరల్చి రెండు తులాల బంగారు పుస్తెల త్రాడు, రెండు గ్రాముల బంగారు కమ్మలను అపహరించారు.
ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ దృశ్యాలు, విశ్వసనీయ సమాచారంతో ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి దొంగిలించిన బంగారు ఆభరణాలు, నేరానికి ఉపయోగించిన సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని, కోర్టులో హాజరుపరచగా రిమాండ్‌కు తరలించారు. కేసుకు సంబంధించిన ఇతర కోణాల్లో దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ సందర్భంగా ప్రజలు అపరిచితుల మాటలను నమ్మి మోసపోవద్దని పోలీసులు సూచించారు. జ్యోతిష్యం, ప్రత్యేక పూజలు లేదా ఇతర మాయమాటలతో దృష్టి మరల్చే ప్రయత్నాలు జరిగితే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్–100కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

