Wednesday, July 15, 2026

Buy now

సీసీటీఎన్ఎస్ 2.0లో కేసుల వివరాలను సకాలంలో అప్‌డేట్ చేయాలి: పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా

ప్రజానవ,రామగుండం: సీసీటీఎన్ఎస్ 2.0లో నమోదయ్యే ప్రతి కేసు వివరాలను నిర్దేశిత గడువులోపు అప్‌డేట్ చేయాలని, మహిళలపై నేరాలు, గ్రేవ్ కేసుల్లో ఎలాంటి అలసత్వం ప్రదర్శించవద్దని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పోలీసు అధికారులను ఆదేశించారు. పెండింగ్ కేసులను వేగంగా పరిష్కరించి, నాణ్యమైన దర్యాప్తుతో నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో నిర్వహించిన అర్ధ వార్షిక నేర సమీక్షా సమావేశంలో కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అధికారులతో సమీక్ష నిర్వహించారు. సీసీటీఎన్ఎస్ 2.0 అప్లికేషన్ ద్వారా కమిషనరేట్ పరిధిలోని పెండింగ్ కేసులు, నిందితుల అరెస్టులు, దర్యాప్తు పురోగతి, నేర నియంత్రణ చర్యలపై స్టేషన్ అధికారులతో ఆన్‌లైన్‌లో సమీక్షించి, అవసరమైన సూచనలు జారీ చేశారు.

ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్న పాత కేసులు, లాంగ్ పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించిన కమిషనర్, దర్యాప్తులో జాప్యానికి గల కారణాలను తెలుసుకుని వెంటనే పరిష్కార చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రతి కేసు దర్యాప్తు పురోగతిని సీసీటీఎన్ఎస్ 2.0లో నిర్దేశిత కాలపరిమితిలో నమోదు చేయాలని, ప్రతి పోలీసు అధికారి సాంకేతిక పరిజ్ఞానంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు.

సీసీటీఎన్ఎస్, ఎస్‌సీఆర్‌బీ నివేదికలు, ఎన్‌టీఆర్ ఫోటో డేటాబేస్‌తో పాటు ఇతర డిజిటల్ రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరించాలని, ఎస్‌హెచ్‌ఓలు కేసులకు సంబంధించిన ప్రతి దశను ఎఫ్‌ఐఆర్ నమోదు నుంచి చార్జ్‌షీట్ దాఖలు వరకు గడువులోపు సిస్టమ్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. తప్పుడు లేదా అనవసర సమాచారాన్ని అప్‌లోడ్ చేయరాదని హెచ్చరించారు.

కమిషనరేట్ పరిధిలో నమోదయ్యే ప్రతి కేసును గడువులోపు పూర్తి చేసి, నాణ్యమైన దర్యాప్తుతో నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రాపర్టీ నేరాలు, చైన్ స్నాచింగ్ కేసుల్లో స్థానిక పోలీసులు, సీసీఎస్ బృందాలు సమన్వయంతో పనిచేసి నిందితులను త్వరగా పట్టుకోవాలని ఆదేశించారు.

మహిళలకు సంబంధించిన తీవ్రమైన కేసుల్లో ఎలాంటి నిర్లక్ష్యం ప్రదర్శించకుండా వెంటనే కేసులు నమోదు చేసి సీసీటీఎన్ఎస్‌లో అప్‌లోడ్ చేయాలని తెలిపారు. నిందితుల అరెస్టులను ఆలస్యం చేయరాదని, గ్రేవ్ కేసులు, ఎన్‌డీపీఎస్ కేసులు, నేరాల పెరుగుదలకు సంబంధించిన అంశాలను డీసీపీలు, ఏసీపీలు స్వయంగా పర్యవేక్షించాలని సూచించారు.

గంజాయి, అక్రమ ఇసుక రవాణా, పేకాట వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ప్రత్యేక దాడులు నిర్వహించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు. ఆస్తి, ఆర్థిక నేరాల కేసుల్లో ఆస్తుల గుర్తింపు, స్వాధీనం, అటాచ్‌మెంట్ ప్రక్రియలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లు, కేడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్లు, ప్రాపర్టీ ఆఫెండర్ల కదలికలపై నిరంతర నిఘా ఉంచాలని ఎస్‌హెచ్‌ఓలను ఆదేశించారు. పోలీస్ స్టేషన్లలో ఫంక్షనల్ వర్టికల్స్‌ను సమర్థవంతంగా అమలు చేసి మెరుగైన పనితీరు కనబరిస్తే రాష్ట్ర స్థాయిలో గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు.

పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుడితో గౌరవంగా వ్యవహరించాలని, వారి సమస్యలను ఓపికగా విని చట్టపరంగా న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఫిర్యాదులో క్రిమినల్ అంశాలు ఉంటే వెంటనే కేసు నమోదు చేయాలని, ప్రతి ఫిర్యాదుపై పారదర్శక విచారణ నిర్వహించి సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని ఆదేశించారు.

పోలీస్ స్టేషన్ దేవాలయంతో సమానమని, పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని కమిషనర్ పేర్కొన్నారు. ఏ సంఘటన జరిగినా వెంటనే స్పందించి వాస్తవాలను నిర్ధారించాలని, దర్యాప్తు ప్రక్రియను పూర్తిగా నమోదు చేసిన తర్వాతే తదుపరి చర్యలు చేపట్టాలని సూచించారు. అనవసరంగా ఎవరినీ పోలీస్ స్టేషన్‌కు పిలవరాదని, అరెస్టుల విషయంలో ఎస్‌ఓపీని తప్పనిసరిగా పాటించాలని హెచ్చరించారు. పోలీసుల ప్రవర్తనే శాఖ ప్రతిష్ఠను నిర్ణయిస్తుందని, విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వబోమని స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్, పెద్దపల్లి డీసీపీ బి. రామ్‌రెడ్డి, అదనపు డీసీపీ (అడ్మిన్) కె. శ్రీనివాస్, వివిధ విభాగాల ఏసీపీలు, సీఐలు, ఇన్‌స్పెక్టర్లు, ఆర్‌ఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular