Wednesday, July 15, 2026

Buy now

ఎల్-నినో సవాళ్లను ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం సర్వసన్నద్ధం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ప్రజానవ బ్యూరో, హైదరాబాద్: వానాకాలం–2026లో ఎల్-నినో ప్రభావాలను దృష్టిలో ఉంచుకుని రైతులు నష్టపోకుండా తెలంగాణ ప్రభుత్వం మూడు దశల ముందస్తు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శాస్త్రవేత్తలు సూచించిన ప్రతి యాజమాన్య చర్యను క్షేత్రస్థాయిలో రైతులకు చేరవేసి, అధికారులు వాటి అమలును నిర్ధారించాలని ఆదేశించారు.

సోమవారం హైదరాబాద్‌లోని ఇక్రిశాట్ (ICRISAT)లో భారత వాతావరణ శాఖ (IMD), ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్‌సీడ్స్ రీసెర్చ్ (IIOR), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ (IIMR), క్రిడా (CRIDA) శాస్త్రవేత్తలు, వ్యవసాయ అనుబంధ శాఖల ఉన్నతాధికారులతో మంత్రి సమగ్ర సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రూపొందించిన మూడు దశల కంటింజెన్సీ ప్రణాళికపై శాస్త్రవేత్తల సూచనలను పరిశీలించి తుది కార్యాచరణపై చర్చించారు.

సమావేశంలో శాస్త్రవేత్తలు ఎల్-నినో ప్రభావాన్ని తట్టుకునే పంటలు, ప్రత్యామ్నాయ సాగు విధానాలు, ఇప్పటికే సాగులో ఉన్న పంటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నివేదిక సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శాస్త్రీయ సూచనలను రైతులకు పూర్తిస్థాయిలో చేరవేసి, జిల్లా కలెక్టర్లు, వ్యవసాయ అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో ఉండి పరిస్థితులను పర్యవేక్షించాలని ఆదేశించారు.

వ్యవసాయశాఖ రూపొందించిన మూడు దశల కార్యాచరణ ప్రకారం జూలై 15, జూలై 30, ఆగస్టు 15 తేదీలను ప్రాతిపదికగా తీసుకుని వర్షాభావ పరిస్థితులకు అనుగుణంగా జిల్లా వారీగా ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసినట్లు అధికారులు వివరించారు. వర్షాలు ఆలస్యమైనా రైతులకు విత్తనాల కొరత రాకుండా అవసరమైన నిల్వలను ముందుగానే సమీకరించినట్లు తెలిపారు.

రాష్ట్రంలోని 33 జిల్లాల వర్షపాతం పరిస్థితులను ప్రభుత్వం రోజువారీగా సమీక్షిస్తోందని మంత్రి తెలిపారు. ప్రస్తుతం 13 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదుకాగా, 20 జిల్లాల్లో వర్షపాతం లోటు ఉందన్నారు. వర్షాభావ జిల్లాల్లో జిల్లా కలెక్టర్లు, వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు సమన్వయంతో పనిచేసి అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలని సూచించారు.

ఎల్-నినోను శాస్త్రీయ విధానాలతో ఎదుర్కొనేందుకు రాష్ట్రంలో డైనమిక్ డిస్ట్రిక్ట్ స్పెసిఫిక్ రెస్పాన్స్ (DSR) విధానాన్ని అమలు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా వర్షపాతం పర్యవేక్షణ, నేల తేమ విశ్లేషణ, వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలు, ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక, నీటి యాజమాన్యం, పంటల వైవిధ్యీకరణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు చెప్పారు.

ఎల్-నినో పరిస్థితులను సమర్థంగా ఎదుర్కోవడానికి భారత వాతావరణ శాఖ, నీటిపారుదల, భూగర్భ జలాలు, విద్యుత్, వ్యవసాయ, ఉద్యానవన శాఖలు సమన్వయంతో ప్రతి వారం మండలాల వారీగా సమగ్ర వ్యవసాయ–వాతావరణ బులెటిన్ విడుదల చేయాలని మంత్రి ఆదేశించారు. వర్షపాతం, వాతావరణ అంచనాలు, భూగర్భ జలాల లభ్యత, సాగునీటి పరిస్థితి, విద్యుత్ సరఫరా, పంటల స్థితి, రైతులు తీసుకోవాల్సిన యాజమాన్య చర్యలు తదితర వివరాలు ఈ బులెటిన్‌లో పొందుపరచాలని సూచించారు. రైతు వేదికలు, గ్రామపంచాయతీలు, వ్యవసాయ అధికారులు, వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియా, స్థానిక మీడియా ద్వారా ఈ సమాచారాన్ని రైతులకు విస్తృతంగా చేరవేయాలని అధికారులను ఆదేశించారు.

శాస్త్రవేత్తలు సూచించిన విధంగా వర్షాలు కురిసి భూమిలో తగిన తేమ ఏర్పడిన తర్వాతే విత్తనాలు వేయడం, నేల తేమను సంరక్షించడం, ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించడం, అవసరమైన సమయంలోనే ఎరువులు వినియోగించడం, నీటిని పొదుపుగా ఉపయోగించడం వంటి యాజమాన్య చర్యలను రైతులు తప్పనిసరిగా పాటించేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు.

వరి రైతులకు నారు నిర్వహణ, నాటే పద్ధతులు, నీటి పొదుపు కోసం ఆల్టర్నేట్ వెట్టింగ్ అండ్ డ్రైయింగ్ (AWD) విధానాన్ని అమలు చేయాలని, ఇంకా నారు వేయని రైతులు తక్కువ కాలంలో పండే రకాలతో డ్రై డైరెక్ట్ సీడెడ్ రైస్ (DDSR) విధానాన్ని అనుసరించాలని సూచించారు. నీటి లభ్యతను బట్టి వరికి బదులుగా మొక్కజొన్న, సజ్జలు, రాగులు, కందులు, మినుములు, పొద్దుతిరుగుడు, నువ్వులు, అలసందలు, కూరగాయలు వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని తెలిపారు. మొక్కజొన్న, పత్తి రైతులు నేల తేమను కాపాడేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు.

రాష్ట్రంలో విత్తనాలు, ఎరువుల కొరత ఉండదని మంత్రి స్పష్టం చేశారు. మూడు దశల కంటింజెన్సీ ప్రణాళికకు అనుగుణంగా అవసరమైన నిల్వలను సిద్ధం చేశామని తెలిపారు. అలాగే ‘రైతు నేస్తం’ కార్యక్రమం ద్వారా ఎల్-నినో ప్రభావాలు, ప్రత్యామ్నాయ సాగు, నీటి యాజమాన్యం, నేల తేమ సంరక్షణ, శాస్త్రవేత్తలు సూచించిన వ్యవసాయ పద్ధతులపై రైతులకు ప్రత్యేక అవగాహన కల్పిస్తామని వెల్లడించారు.

రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎల్-నినో ప్రభావం ఎంత తీవ్రంగా ఉన్నా రైతులకు నష్టం జరగకుండా ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భరోసా ఇచ్చారు.

Related Articles

spot_img

Most Popular