**ప్రజానవ,హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతి దాహానికి నిలువెత్తు నిదర్శనమని ప్రభుత్వ విప్ డాక్టర్ బల్మూర్ వెంకట్ ఆరోపించారు. గత పదేళ్లలో కాళేశ్వరం పేరుతో లక్ష కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకున్నారని విమర్శించారు.
సోమవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ఫోటో ప్రదర్శనను ఏర్పాటు చేసిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత కేసీఆర్‌పై ఉందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఎలా “కేసీఆర్ కూ ళేశ్వరంగా” మార్చారో ఫోటో ప్రదర్శన ద్వారా ప్రజలకు చూపిస్తున్నామని తెలిపారు.
ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిని బయటపెట్టామని, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా నిర్మాణాల్లో లోపాలను గుర్తించిందని పేర్కొన్నారు. అయినప్పటికీ బీఆర్ఎస్ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టించేలా అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ ఆలోచన కాదని, దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి హయాంలో జలయజ్ఞంలో భాగంగా ఈ ప్రాజెక్టుకు రూపకల్పన జరిగిందని బల్మూర్ వెంకట్ తెలిపారు. తాము ఏదో కొత్తగా చేశామని చెప్పుకునే ప్రయత్నంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని విమర్శించారు.
ప్రస్తుతం ప్రజా ప్రభుత్వం రైతులకు రైతు భరోసా నిధులు అందజేస్తూ వారి సంక్షేమానికి కృషి చేస్తోందని, రైతుల్లో నెలకొన్న సానుకూల వాతావరణాన్ని చూసి బీఆర్ఎస్ నాయకులు తట్టుకోలేకపోతున్నారని అన్నారు. అందుకే కాళేశ్వరం ప్రాజెక్టు, రాష్ట్ర ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్‌కు నిజంగా ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి కాళేశ్వరం అంశంపై చర్చించి ప్రజలకు వాస్తవాలు చెప్పాలని సవాల్ విసిరారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పైనా బల్మూర్ వెంకట్ విమర్శలు చేశారు. తెలంగాణ భవన్‌లో బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు నిర్వహించే ముందు కేటీఆర్ స్వయంగా రక్తదానం చేసి, తన రక్త నమూనాను డ్రగ్ పరీక్షకు పంపించాలని సవాల్ విసిరారు. గతంలో తాను విసిరిన “వైట్ టెస్ట్” సవాల్‌ను కేటీఆర్ స్వీకరించలేదని పేర్కొన్నారు. గత పదేళ్లలో తెలంగాణలో డ్రగ్ కల్చర్ పెరగడానికి బీఆర్ఎస్ పాలనే కారణమని ఆరోపిస్తూ, తన సవాల్‌ను స్వీకరించాలని కేటీఆర్‌ను మరోసారి డిమాండ్ చేశారు.

