ప్రజానవ,సిరిసిల్ల: ఏడాది నుంచి 19 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న ప్రతి చిన్నారి, విద్యార్థికి అల్బెండజోల్ మాత్రలు తప్పనిసరిగా వేయించాలని సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు.
జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా తంగళ్లపల్లి మండలం నేరెళ్ల ప్రాథమిక పాఠశాలలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు అల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఓ విద్యార్థిని వేసిన చిత్రాన్ని పరిశీలించిన కలెక్టర్ ఆమెను అభినందించి సన్మానించారు.
అనంతరం పాఠశాల ఆవరణలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ అక్కడి చిన్నారులతో మాట్లాడి వారికి అందిస్తున్న కోడిగుడ్లు, పోషకాహారంపై ఆరా తీశారు. పిల్లలను పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు తెలుసుకున్నారు. అంగన్వాడీలోని ఆట వస్తువులు, బాలామృతం ప్యాకెట్లను పరిశీలించి, అందుబాటులో ఉన్న ఆట వస్తువులను తప్పనిసరిగా వినియోగంలోకి తీసుకురావాలని జిల్లా సంక్షేమ అధికారిని ఆదేశించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ, ప్రతి ఏడాది రెండుసార్లు అల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేస్తామని తెలిపారు. నులిపురుగుల నివారణ ద్వారా పిల్లలు రక్తహీనతతో పాటు పలు అనారోగ్య సమస్యల నుంచి రక్షణ పొందుతారని చెప్పారు.
అన్నం తినే ముందు, తిన్న తర్వాత చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలని, కూరగాయలు, పండ్లను శుభ్రంగా కడిగిన తర్వాతే వినియోగించాలని సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను కూడా పాటించాలని పిల్లలకు సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ఫ్రెడ్, జిల్లా విద్యాధికారి మొండయ్య, జిల్లా పంచాయతీ అధికారి జయశీల, ఇన్చార్జి తహసీల్దార్ మురళి, ఎంపీడీఓ రమేష్, సర్పంచ్ పొన్నం లక్ష్మణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

